26 C
Vijayawada
Sunday, July 14, 2024
Homeజాతీయ నీతిసుజనా ప్లాన్ రెడీ చేస్తున్నారా ?

సుజనా ప్లాన్ రెడీ చేస్తున్నారా ?

జగన్ వన్ టైమ్ వండర్, మీరు రాసిపెట్టుకోండి. ఆయనకి వయసు ఉండి ఉండొచ్చు. జనం భారీ అవకాశం ఇచ్చి ఉండొచ్చు కానీ ఏపీకి ఇప్పటికే స్పష్టత వచ్చేసింది – అంటూ బీజేపీ ఎంపీ సుజనా చౌదరి చేసిన కామెంట్ ఏపీ భవిష్యత్ రాజకీయానికి సంకేతమా ? సంచలన విషయాల్ని కూడా సైలెంట్ గా చెప్పుకుంటూ వెళ్లిపోయే సుజనా ఇంటర్వ్యూలో ఇదే కాదు ఇంకో మూడు నాలుగు పాయింట్లు కూడా ఉన్నాయ్. అవేంటో చూస్తే, లోతుపాతులు అర్థం చేసుకుంటే, రేపటి రాజకీయం ఎలా ఉంటుందో ఇవాళే ప్రివ్యూ కనిపించేట్టుగా ఉంది. ఇంతకీ ఏపీలో ఏం జరగబోతోంది ? సుజనా చెప్పిన ఆ నాలుగు విషయాలేంటి ?

అసలు ఆ మాట మొదటిసారి అన్నవాడికే సరిగా సమాధానం చెప్పి ఉంటే అసెంబ్లీ వరకూ వచ్చేది కాదు, బాధ అనిపించింది. అందరికంటే ముందు, అరగంటలోనే నేనే ఖండించా – చంద్రబాబు కన్నీళ్లపై సుజనా కామెంట్ ఇది. టీడీపీ అధినేతపై అభిమానంతోపాటు ప్రస్తుతం నడుస్తున్న రాజకీయం, వాస్తవ పరిస్థితులు కూడా ఇందులోనే వచ్చేశాయ్. చంద్రబాబే రాజకీయాల్లోకి తీసుకొచ్చాడు కాబట్టి పార్టీలో ఉన్నా లేకపోయినా ఆ అభిమానం అలాగే ఉంటుంది అనేది సుజనా వెర్షన్ ముందు నుంచి. అది ఓకే. మొదటసారి అన్నప్పుడే సమాధానం చెప్పి ఉంటే అనేది కరెక్ట్ లాజిక్ నిజానికి. తోటకూర నాడే చెప్పి ఉంటే తోలు వలిపించుకునే వరకూ వచ్చేది కాదుగా అన్నది సామెత. ఏ విషయంలో అయినా అంతే. టీడీపీ అలుసు ఇచ్చినమాట వాస్తవం కాబట్టే అంత వరకూ వచ్చింది సీను. పైగా పార్టీ అధినాయకుణ్ని కాపాడుకునే వ్యవస్థ కూడా లేదేమో అంటూ సుజనా రేకెత్తించిన సందేహం కూడా అక్షరాలా నిజం. ప్రతీ సందర్భంలోనూ చంద్రబాబు నేరుగా వచ్చి సమాధానం చెబితే తప్ప దిక్కులేనట్టుగా ఉంటాయ్ టీడీపీ వ్యవహారాలు. అంబటి రాంబాబుకి కూడా బాబే సమాధానం చెప్పాల్సిరావడం అలాంటి సందర్భమే ! సరే, వీటి సంగతి అలా ఉంచితే ఏపీ భవిష్యత్ మీద సుజనా చెప్పిన సంచలన విషయాలు రేపటి రాజకీయాన్ని ఆవిష్కరిస్తున్నట్టుగా ఉన్నాయ్.

ఎలా సంపాదించాడు, అంతటి వ్యాపార సమ్రాజ్యాన్ని అక్రమంగానా సమక్రమంగానా.. నిర్మించాడు అనేది పక్కన పెడితే, జగన్ ఏదో రకంగా కష్టపడిన మాట వాస్తవం. 150 వచ్చాయి, రాజకీయంగా కూడా తెలివైన నాయకుడు అనుకునేవాణ్ని. కానీ ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు, కక్షసాధింపు, ప్రభుత్వ వైఫల్యాలూ చూస్తుంటే నా అభిప్రాయం మారింది – అని సుజనా చెప్పిన పాయింట్ నిజానికి ఆయన ఒక్కడి అభిప్రాయం మాత్రమే అనలేం. ఎందుకంటే ఏపీలో మిడిల్ క్లాస్, ఎబౌ మిడిల్ క్లాస్ అందరూ ఒక్క ఛాన్స్ అని అడిగితే ఆశపడి అటు వైపు చూసినవాళ్లే. అలాంటి వాళ్లకి ఇప్పుడు జ్ఞానదంతాలు మొలిచిపోయాయ్. ఇదే పాపులర్ ఒపీనియన్ ను బేస్ చేసుకొని సుజనా చెప్పినట్టుంది. ఇంతకంటే కీలకమైన కామెంట్ కూడా వచ్చింది ఇదే వరసలో. రాష్ట్రంలో ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఏపీ పరిరక్షణ సమితి లాంటిదేదో రావాల్సిన అవసరం కనిపిస్తోంది అనడం చాలా మందిలో ఆసక్తిరేకెత్తిస్తోంది. ఎందుకంటే ప్రాంతాలు, కులాలు, ఉద్యోగ-వ్యాపార అనే తేడా లేకుండా అన్ని వర్గాల్లోనూ ఇప్పుడు సర్కారువారి బాధితులు పెరిగిపోతున్నారు. వీళ్లకి అండగా, భవిష్యత్ ను నిలబెట్టే ఆశగా పరిరక్షణ సమితి లాంటిదేదో వస్తే నిజంగా అదో కొత్త వేదిక, ఆలోచన, భవిష్యత్తు అవుతుందేమో అనిపించింది. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఏపీ. థింక్.

ఏపీకి ఏం కావాలో ఇక్కడి ప్రభుత్వం అడిగినట్టు, కేంద్రంలో పావులు కదిపినట్టు నాకైతే తెలియదు అనే మాటలోనే అన్నీ ఉన్నాయ్. పోలవరం సంగతేంటో, కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టులు, అందాల్సిన నిధుల పరిస్థితి ఏంటో తెలిసిపోయింది ఇక్కడే. నేను స్వయంగా వైసీపీ నాయకులకు చాలాసార్లు చెప్పా, మనం కలిసి ఏపీకి ఏం కావాలో చేద్దాం రండి, కేంద్రంతో మాట్లాడదాం అని – వాళ్లు మాత్రం స్పందిచలేదు అనడంలోనే అర్థం కావాల్సినవాళ్లకి అర్థం అయిపోయింది. వీటితోపాటు జగన్ నేరుగా ప్రధాని అయినా ప్రత్యేక హోదా వచ్చే పరిస్థితి లేదు అనడం కొంత మందికి రుచించకపోవచ్చు కానీ వాస్తవం. కన్నీళ్లు పెట్టించే అబద్ధం కన్నా కఠినంగా వినిపించే వాస్తవం చాలాసార్లు బెటర్. ఇలాంటివి కూడా ముక్కుసూటిగా చెబుతున్నప్పుడే సుజనాను చూస్తే అనిపిస్తుంది – రాజకీయాల్లో ఉన్నా, బొత్తిగా రాజకీయం తెలియని మనిషి అని. ఉన్నది ఉన్నట్టు మాట్లాడ్డం, జరిగేదీ జరగాల్సిందీ మాత్రమే చెప్పడం ఇప్పటి వరకూ చాలామంది నాయకులకి అలవాటు లేదు. సుజనా ఆ ట్రెండును పాపులర్ చేయగలరేమో చూడాలి. ఎందుకంటే ఏపీకి ఇప్పుడు డైజెస్ట్ కావాల్సింది… వాస్తవాలే !

పవన్ కల్యాణ్ విషయంలోనూ సుజనా కామెంట్ ఆలోచనలు రేకెత్తించేదిగానే ఉంది. బీజేపీ విషయంలో ఆయన అసంతృప్తిగా ఉన్నాడు అంటున్నారు అంటే – సమాధానం అదిరింది. ఆయన ఇండిపెండెంట్ పర్సన్. ఆయన నిర్ణయాలు ఆయనే తీసుకోగలరు అనడంలో రెండు మూడు విషయాలు క్లియర్ అయిపోయాయ్. అంత ఇబ్బంది పడుతూ బీజేపీతో ఉండటం ఎందుకు, ఇబ్బందే నిజం అయితే అలా ఎందుకు ఉంటారు అనేది ఫస్ట్ పాయింట్. ఇక బీజేపీతో ఆయన పార్టీ కలిశాక మేం మాట్లాడుకోలేదు అనడం వ్యూహాత్మకమో, లేదంటే మాటల్లో మాటగా వచ్చిందో తెలియదు కానీ అదీ ఇంపార్టెంటే. ఏపీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ లాంటి పాపులర్ నాయకుడికి వ్యూహం, దన్ను, సపోర్టు ఇచ్చే యంత్రాంగం ఉండాలి. అలాటివి ఉన్న నాయకుల అండదండలైనా కావాలి. బహుశా ఇది అలాంటి సంకేతమేమో !

మొత్తానికి ఇటు రాజకీయ కోణాలు, అటు ఏపీ ఆర్థిక స్థితిగతుల మొదలు భవిష్యత్ వరకూ చాలా విషయాలపై సంకేతాలు ఇస్తున్నట్టుగా అనిపించింది సుజనా మాట్లాడిన తీరు చూస్తే ! మరి బీజేపీ ఏదైనా వ్యూహం మార్చి స్పీడు పెంచుతుందా… సుజనా ఏదైనా గ్రౌండ్ ప్రిపరేషన్ లో ఉన్నారా అనేది ఇప్పటికైతే అంచనానే. ఏపీలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. అలాగని తనని తాను రక్షించుకోవడంలోనే ప్రతిపక్ష నాయకుడు తడబడుతున్నాడు అనడంలోనే చాలా అర్థం ఉంది. కొత్తగా ఏదైనా ప్రయత్నం చేస్తారా అనేది ఆసక్తికరమే. ఎందుకంటే సుజనా రంగంలోకి దిగడం అంటే ఓ వ్యక్తి రావడం కాదు వ్యవస్థ కదలడం అనుకోవచ్చు ఓ రకంగా. కేంద్రంలో పలుకుబడి ఉండి, రాష్ట్ర పరిస్థితులపై అసగాహన ఉండి, సామాజికంగా – ఆర్థికంగా ప్రబలంగా ఉన్నసుజనా లాంటి నాయకుడు సీరియస్ గా దిగితే ప్రకంపనలు రావడం ఖాయం. ఏపీ ఇప్పుడున్న పరిస్థితి అలాంటిది. జనంలో అలజడి, అసంతృప్తి ఆ స్థాయిలో ఉన్నాయ్. పైగా – బీజేపీ కూడా ఇప్పుడు పట్టుపట్టి కూర్చునే పరిస్థితి లేదు. ఏపీలో ఆ పార్టీ లోతు ఎంతో ఢిల్లీ నాయకత్వానికి తెలుసు. ఒక్క ఏపీ అనే కాదు, పంజాబ్ లాంటి చోట్ల కూడా ఫ్లెక్సిబుల్ గా వెళుతూ, అమరీందర్ లాంటి వాళ్లకి బ్యాకప్ ఇస్తామంటున్నది అందుకే. ఇదంతా 2024 కోసం చేస్తున్న ప్లానింగ్ లో భాగం. మరి అలాంటి వ్యూహాలు ఏపీలో కూడా ఉంటాయా… లేదంటే ఏపీ సమస్యలకి మా దగ్గర సమాధానం ఉందీ అంటూ నేరుగా రంగంలోకి దిగే అవకాశం ఉంటుందా అనేది తేలాల్సిఉంది.

వీటన్నిటిని బట్టీ చూస్తే ఒక విషయం మాత్రం పక్కా. ప్లాన్ రెడీ చేయడం అయితే ఖాయంగా జరుగుతున్నట్టుగానే ఉంది. కాకపోతే అది బీజేపీలో ఉంటూ, బీజేపీతో వెళుతూ పట్టాలెక్కించే ప్లానా… ఏపీ కోసం ఓ కొత్త ప్రోగ్రామింగ్ తో కొత్త వ్యూహంతో వచ్చే ప్లానా అనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. అసలే నింపాదిగా ఉంటే మనిషి. అందులోనూ అన్ని కోణాల్లోనూ ఆలోచించిన తర్వాతే బయటకొచ్చే రకం. అల్లాటప్పాగా ఏదీ చేస్తారని అనుకోలేం కాబట్టి ఆ ప్లానేంటో, భవిష్యత్ ప్రణాళిక ఏంటో ఎలా ఉంటుందో తెలియడానికి మరికొద్ది రోజులు పట్టొచ్చేమో

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments