41 C
Vijayawada
Wednesday, June 7, 2023
Homeరాజ నీతిచంద్రబాబు కన్నీటి విలువ ఎంత ?

చంద్రబాబు కన్నీటి విలువ ఎంత ?

డైనోసార్లు ఎప్పుడు అంతరించిపోయాయో తెలీదు కానీ సంస్కారంలో చివరి అణువు ఆత్మహత్య చేసుకున్నది మాత్రమే ఇవాళే ! ఓ రాష్ట్రం ఇక సంస్కారాన్ని సమాధుల్లో చూసుకోవాల్సిందే ! మర్యాద, మానవత్వం లాంటి వాటిని పాతాళంలో వెదుక్కోవాల్సిందే ! ఎంత లోతుకు పతనం కాగలమో చూపిస్తామంటూ సుపారీ తీసుకున్నట్టుగా మన సభ్యత దిగజారి దిక్కుమాలినదైపోతోంది. ఓ డబ్భైయేళ్ల పెద్దాయన ఇలాంటి కారణంతో దారుణంగా విలపించిన ఘటన చరిత్రలో ఒక్కటైనా ఉంటే పోల్చుకురండి ! తేల్చుకుందాం మనం ఎక్కడ ఉన్నామో ! సింప్లీ… వి ఆర్ నో వేర్.

చంద్రబాబుకి సముద్రమంత సహనం ఉంటుంది. లెక్క కట్టలేనంత ఓపిక ఉంటుంది. పేలుడును దాటి ధూళిని దులుపుకొంటూ బయటకొచ్చినప్పుడు కూడా బాబు కళ్లల్లో తొట్రపాటు లేదు. ఏమైంది చంద్రయ్యా అంటూ అమ్మణ్నమ్మ భోరున విలపిస్తున్నప్పుడు పైకి లేవని చేతితో ఆమె కన్నీరు తుడిచిన బాబు చాలా మందికి ఇప్పటికీ గుర్తు. ఉమ్మడి రాష్ట్రంలో 40 సీట్లకి అటు ఇటుగా ఆగిపోయినప్పుడు బెరుకులేదు. ఇంతకు ముందు 23 మాత్రమే మిగిలినప్పుడూ తొణకలేదు. ఈ వయసులోనూ అంతే నిఠారుగా నిలబడ్డాడు. నిలబడిన చోటే కూలబడ్డాడు అని ప్రచారం చేసినా చలించలా ! నాకు వ్యక్తిగతం అంటూ ఏం లేదమ్మా, నిన్న రాష్ట్రం మొన్న రాష్ట్రం… రేపు ఎల్లుండి కూడా రాష్ట్రమే మన జీవితం అని ఆయన సన్నగా నవ్వుతూ చెప్పగా విన్నవాళ్లు వేలులక్షలు. చెప్పడం కాదు చేతల్లో చూపిస్తున్నాడు గత 35 ఏళ్లుగా ఇదే జీవితాన్ని ! అలాంటి బాబు ఇప్పుడు భోరుమనడం అంటే రాష్ట్రం మానసికంగా దివాళాతీయడమే ! స్పందించే గుణం, చలించే తత్వం, ఖండించలేని మేధావితనం మూకుమ్మడిగా చచ్చిన నేల మీద రాలిన బొట్టు… ఆ కన్నీరు.

కళ్ల ముందే రాష్ట్రం కలలు కూలుతున్నప్పుడు ధైర్యం చెప్పాడు. పిచ్చోళ్లుగా ముద్రలేసి చంపుతున్నప్పుడు వెన్నంటి నిలిచి గెలిచేవరకూ ఉంటానని భరోసా ఇచ్చాడు. గేట్లు పగలగొట్టుకొచ్చి అరాచకం మీదపడుతున్నప్పుుడు మీరు నన్నేం చేయలేరు అని ఒక్కడే సైన్యమై నిలబడ్డాడు. కలబడ్డాడు. మరి వీడి వీక్ నెస్ ఏంటి ? వీడికి వ్యక్తిగతం లేదు సొంత జీవితం లేదు. మరో పని లేదు. ధ్యాసా కనిపించదు. రాష్ట్రం, రాష్ట్రం కోసం రాజకీయం. ఓడినా జంకకపోవడం, గెలిచే వరకూ పోరాటం చేయడం, తనకి తాను పదును పెట్టుకుంటూ నిరంతరం నిలబడ్డం. ఇంతేనా వీడి బతుకు ? కాదు ! అల్లంత ఎగిరే ఫుట్ బాల్ కి కూడా గింజంత వాల్వ్ ఉంటుంది. గాలి నింపడానికీ అదే. తీయడానికీ అదే. మనిషి కూడా అంతే. వాడు ఎవడైనా. ఎక్కడున్నా. చంద్రబాబూ అతీతుడేం కాదు. కుటుంబమే వీక్ నెస్. ఆమే ప్రాణం. అంతే ! ఈ దాడి అందుకే !

మీకూ ఉన్నాయ్ సంసారాలు. మీకూ ఉంటారు భార్య, పిల్లలు. మీకు ఎంత బాధ అనిపిస్తుందో ఆలోచించండి అని కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నాడు చూశారు… ఆ మాటతో మనిషన్నవాడు ఎవడైనా కంచం ముందు నుంచి లేస్తాడు. కుళ్లి కుళ్లి ఛస్తాడు. సిగ్గులేని జాతికి కొట్టిన ఛర్నాకోలు దెబ్బ ఆ మాట. చంద్రబాబు చెప్పింది ప్రతీదీ నిజం అయ్యింది లెక్క చూసుకోండి. రాజధాని ఉండదు అని చెప్పినప్పుడు నమ్మలా. అరాచకం ఏలుతుంది అన్నప్పుడూ తలకెక్కలా. మీ బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించండి అని చెప్పినప్పుపడూ తెలుసుకోలా. రాష్ట్రం సర్వనాశం అవుతుంది మీ ఇష్టం అంటూ చేతులెత్తిన క్షణాలు ఇప్పటికే లక్షల కుటుంబాల కళ్లల్లో కనిపిస్తున్నాయ్. అవన్నీ నిజం అని రుజువు అయ్యాయ్. ఇది అంతకు మించి బాగుకోరేవాడిని బాధపెట్టినోళ్లు తుడిచిపెట్టుకుపోయినట్టే చరిత్ర చెబుతోంది. ఏపీ ఎంత మాత్రం అతీతం కాదు.

అరాచకం మొదలైనప్పుడు బాధొస్తుంది. దాడులు ఎదుర్కొంటున్నప్పుడు కేకలు పుడుతాయ్. ఓ దశ దాటిన తర్వాత కన్నీరే గుండెమంటను ఆర్పుతుంది. ఆ తర్వాతే కరుడుకట్టిన పోరాటం మొదలువుతుంది. ఓ మనిషికైనా, జాతికైనా,రాష్ట్రానికైనా. రక్తమాంసాలున్నఎవరికైనా ఇదే ప్రకృతి నియమం. ఆ రాలిన బొట్టే ఆఖరు. అంతిమ పోరాటానికి ఇదే మొదలు అని మౌనంగా చెప్తున్నట్టు కనిపించాడు నడుస్తున్న చంద్రబాబు. ఫలితాలు సాధించి పరిణామాల్ని శాసించే అలవాటు ఉన్న చంద్రబాబు దు:ఖాన్ని దిగమింగి… ఇక రంగంలోకి దిగుతాడు. దుర్మార్గపు అరాచకం పతనానికి ఏపీ పునరుజ్జీవానికి శిలాశాసనం ఆ కన్నీరు. ఇవాళ అదే జరిగింది. నవంబర్ 19. కన్నీటి రోజుగా గుర్తుపెట్టుకునే స్థాయిలో ఏపీ తేరుకునే రోజు ముందు ముందు రాబోతోంది. అప్పుడే వస్తా మళ్లీ అంటూ చంద్రబాబు శపథం చేసింది కూడా అందుకే !

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments