37 C
Vijayawada
Friday, April 12, 2024
Homeరాజ నీతితెలుగు జాతికి ఏమిచ్చింది 40 ఏళ్ల తెలుగు దేశం ?

తెలుగు జాతికి ఏమిచ్చింది 40 ఏళ్ల తెలుగు దేశం ?

నోట్ల సంచులు ఎన్ని వేస్తున్నా… తక్కెడ మొగ్గడం లేదు. ఎందుకంటే అవతల పక్క అన్నగారి ఆత్మగౌరవ కండువా ఉన్నది. ఆ ఆత్మగౌరవ భారీతనం ముందు ఢిల్లీ బానిసత్వం ఓడింది. జవ సత్వం తెచ్చింది – అంటూ ఓ కార్టూన్ వచ్చింది. ఎన్టీఆర్ 83 లో గెలిచాక మారిన రాజకీయానికి ఇదో మచ్చుతునక. తులాభారం స్ఫూర్తితో వచ్చిన ఆ కార్టూన్ తెలుగు వాడి గుండెల మీద అవమాన భారాన్ని ఎన్టీఆర్ ఎలా దించేశాడో కళ్లకు కట్టింది. 83లో ప్రపంచ కప్ గెలవడం ఇండియాలో క్రీడాస్ఫూర్తిని రగిల్చిన ఘట్టంగా చరిత్రలో నిలిచిపోయినట్టే… 83లో టీడీపీ గెలవడం ఆంధ్రుల, అందులోనూ మరీ ముఖ్యంగా బడుగుల అజెండాను జెండాగా దేశ రాజకీయాల్లో ఎగరేసింది. చండ ప్రఛండమైన తెలుగు కీర్తిని దశ దిశలా వ్యాప్తి చేసింది. అవును. సరిగ్గా 40 ఏళ్ల కింద పుట్టి, తెలుగు జాతి నిర్మాణానికి పునాదులు వేసిన పార్టీ తెలుగు దేశం. తెలుగు తేజం.

ముహూర్త బలాన్ని పక్కాగా లెక్కగట్టి నందమూరి తారక రాముడు రాజకీయాల్లో అఢుగు పెట్టినట్టు ఉన్నాడు, రాహుకేతువులంటని రాజకీయాన్ని భవిష్యత్తుకి ఇవ్వాలని తలచినట్టు ఉన్నాడు… అందుకే తెలుగు దేశం సవాళ్లకు ఎదురెళ్లి నిలుస్తోంది. శివాలెత్తిన ఉత్సాహంతో సంక్షోభాల్ని గెలుస్తోంది. జనం దిక్కుతోచని స్థితిలో పడ్డ ప్రతీసారి ఆదుకునే దిక్కుగా నిలుస్తూ 40 వసంతాల ఉత్సవాన్ని ఉత్సాహంతో చేసుకుంటోంది. ఎన్టీఆర్ శత జయంతి వేళ ఇదో మరుపు రాని మైలురాయి. పుట్టిన రోజూ… పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసినది ఎందరికి ? అందుకే ఓ సారి మననం చేసుకోవడం అంటే మనల్ని మనం చూసుకోవడం అద్దంలో !

ఇంతకీ తెలుగు దేశం ఏం సాధించింది ? మిగతా పార్టీలకీ టీడీపీకీ తేడా ఏంటి ? తెలుగు నేలపై తెలుగు వాడిపై, తెలుగు నాడిపై టీడీపీ ముద్ర ఎలా కనిపిస్తుంది ? అసలు నలభై ఏళ్లు రావడం అంటే రాజకీయంలో అర్థమేంటి ? ఇవన్నీ ఈ తరానికి తెలియజెప్తూ, నిన్నటి మేథకు గుర్తు చేస్తూ రేపటిని ఆహ్వానించే సందర్భంలో తెలుగు సంతకం ఎలా కనిపిస్తోందో చూద్దాం !

విధానమే ఓ నినాదం…

ఆలోచన ఇవ్వడం
నిరంతరం జనంతో మమేకం అవ్వడం
కష్టకాలంలో కూడా నిష్టగా నిలవడం
తెలుగు జాతి సంక్షోభంలో పడిన ప్రతీసారీ గెలవడం
ఎప్పటికీ జనం గుండెల్లో వెలగడం
మాత్రమే తెలుగు టీడీపీకి. ముందు నుంచి విధానమే టీడీపీ నినాదం. అంటే చెప్పిందే చేస్తుంది. చేసేదే చెప్తుంది అనే ముద్రకు అదే కారణం. తెలంగాణ నాది, రాయలసీమ నాది సర్కారు నాది, నెల్లూరు నాది అంటూ జెండా ఎగరేసిన ఎన్టీఆర్… తెలుగోడి తెగింపును తెగువను, అంతకు మించి తెలివినీ దేశానికి చాటి చెప్పడమే కాదు ప్రపంచానికి చాటింపు వేసిన ఘట్టం తెలుగు దేశం. తెలుగు వాడంటే ఆత్మగౌరవం అనే ఆలోచన రగిల్చి, జనం కష్టాల్లో ఉన్న ప్రతీసారి – అధికారంలో లేకున్నా అండగా నిలవడం టీడీపీ నిజాయితీకి నిదర్శనం. ఉత్తరాఖండ్ విలయంలో చిక్కిన వారిని కాపడటం చేతగాక నాటి ప్రభుత్వం చేతులెత్తేస్తే ప్రత్యేక విమానాలతో ఆదుకున్న రోజుల్ని, తుఫాన్ తీవ్ర నష్టం మిగిల్చిన విశాఖను మూడు వారాలు తిరగక ముందే మళ్లీ తలెత్తుకు చేసిన ఘడియల్ని, అన్నిటికీ మించి రాష్ట్రం ముక్కలై రోడ్డున పడ్డాం అనుకున్న ఆంధ్రజాతిని మళ్లీ గాడిన పెట్టిన ఘనతను టీడీపీ చెప్పుకోకపోవచ్చు. కానీ తరతరాలూ ఒప్పుకుంటారు తెలుగు వాళ్లు.

పుట్టిన ఎనిమిది నెలల్లోనే అధికారం ఇచ్చిన తెలుగు వాడికి… ఏమిచ్చింది తెలుగు దేశం ? ఇప్పుడు కాదు ఇంకో వందేళ్లైనా టీడీపీ అంటే గుర్తొచ్చేది ఏంటి ? భౌగోళికంగా విడిపోయినా, ఎన్టీఆర్ భౌతికంగా లేకపోయినా, చంద్రబాబూ ప్రతీసారీ అధికారంలోకి రాకపోయినా తెలుగు దేశం ముద్ర తెలుగు నేల మీద ఎలా కనిపిస్తోంది ? టీడీపీ సంతకాన్ని ఈ జాతి ఎలా చూస్తోందంటే…

ఏమిచ్చింది తెలుగు దేశం ?

ప్రపంచాన్ని గెలవాలన్న ఆలోచన, అవకాశాలు అందించింది టీడీపీ
జీవితాల్ని శాసిస్తున్న సాఫ్టువేర్ రివొల్యూషన్ ను తెలుగు గడ్డపైకి తెచ్చింది టీడీపీ
తెలుగు నేలపై మౌలిక సదుపాయాల విప్లవానికి పునాది వేసింది టీడీపీ
ఆడపడుచుల ఆస్థిత్వాన్ని నిలుపుతూ ఆస్తి హక్కు తెచ్చింది టీడీపీ
తెలంగాణ ఆత్మగౌరవ జెండా ఎగరేస్తూ పటేల్ పట్వారీల్ని పక్కనపెట్టింది టీడీపీ
హైదరాబాద్ కి హంగులు అద్ది ఆధునికతకు బాటలు పరిచింది టీడీపీ
ఏదేశమేగినా ఏపీ వాడినని చెప్పుకునే ఐడెంటిటీ ఇచ్చింది టీడీపీ
సంక్షోభం చుట్టుముట్టిన ప్రతీసారీ నేనున్నానంటూ చేయి అందించి నిలిపింది టీడీపీ
నవీన ఏపీ నిర్మాణానికి పునాదులేసింది టీడీపీ
పేదలకు కూడు పెట్టి గూడు కట్టింది టీడీపీ
మన ఖర్మేంటిరా ఇలా అయ్యిందన్న టైంలో కర్మాగారాలు తెచ్చి రాత మార్చింది టీడీపీ
రేపటి రాజధాని కలను సాకారం చేసేది టీడీపీ
పోలవరం నిర్మించి కలవరం తీర్చేది టీడీపీ
పలాస నుంచి కుప్పం దాకా కుదుటపడే వరకూ కునుకులేకుండా పనిచేసేది టీడీపీ

ఘనమైన గతం సరే, పోరాటాల వర్తమానమూ కళ్ల ముందు కనిపిస్తోంది. మరి భవిష్యత్ సంగతేంటి ? అధోగతి దిశగా పతనం అవుతున్న ఆంధ్ర దేశాన్ని ఆదుకునేందుకు టీడీపీ ఏం చేయాలి ? ఏం చేస్తుంది ? ఇదే ఇప్పుడు అసలు పాయింట్. జాతి డీలా పడుతున్న ప్రతీక్షణంలోనూ టీడీపీ గెలిచి నిలచిన దాఖలా ఉంది. ఉంటుంది. కానీ… అసలు టీడీపీ అంటే ఏంటి ? కుల కుత్సిత కుతంత్రాల్ని ఎలా బద్దలు కొడుతుంది ? ఆంధ్రుణ్ని మళ్లీ అగ్రగామిగా ఎలా నిలబెడుతుంది అనేది చేతల్లో చూపించాల్సిన రోజులు వచ్చాయ్. 40 ఏళ్ల వేడుకతో కొత్త పోరాటానికి సిద్ధపడాల్సిన సిద్ధపడాల్సిన రోజుల్లో…

అసలు ఏంటీ 40 ఏళ్లు…

40 అంటే పని చేసే వయసు
40 అంటే శ్రమకోర్చి చెమట చుక్కలతో చరిత్ర సృష్టించే వయసు
40 అంటే పరిణతి వచ్చిన వయసు
40 అంటే ఇటు నవతరానికీ అటు పెద్దరికానికీ వారధిగా వర్థిల్లే వయసు
40 అంటే ముందుండి దారి చూపించే వయసు

అందుకే టీడీపీ 40 ఏళ్ల పండగ ఇప్పుడు ఆంధ్ర జాతికీ, తెలుగు సమూహానికి చిరస్మరణీయ మలుపు. అంతకు మించి మేలుకొలుపు. ఇది నా రాష్ట్రం అని చెప్పుకునే ప్రత్యేకతలకు పాడిగడుతూ, అప్పులతో రాష్ట్రాన్ని పాడుపెడుతూ రాజధానికి సైతం నిలువ నీడ లేకుండా చేసిన పీడనను పోగొట్టేందుకు… మళ్లీ నూతనోత్తేజంతో ఏపీని భవిష్యత్తు వైపు నడిపించేందుకు దార్శనిక నాయకత్వపు దర్శకత్వం ఏపీకి కావాలని ముక్తకంఠంతో కోరుకునే క్షణాన 40 ఏళ్ల పండగ… జనం గుండెల నిండుగా !

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments