ఢిల్లీలో స్విచ్ నొక్కితే రాష్ట్రాల్లో వెలగడమో… ఆరడమో… ఇప్పటి వరకూ తెలుసు. బట్ ఫర్ ఎ ఛేంజ్… ఇప్పుడు ఓ రాష్ట్రంలో బటన్ నొక్కితే ఢిల్లీలో పవర్ కట్టో హిట్టో తేలే పరిస్థితి కనిపిస్తోంది. బెంగాల్ ఎఫెక్ట్ అంతలా ఉంది మరి ! అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ వచ్చాక కేంద్రంలో ఏదో తలకిందులు అయిపోతుందని చెప్పడం లేదు కానీ వ్యూహం మాత్రం అమాంతం మారిపోతుంది. ఆ ఎఫెక్ట్ వచ్చే జనరల్ ఎన్నికల తీరు తెన్నుల్ని తేల్చేస్తుంది. ఏపీతో సహా చాలా రాష్ట్రాల మీద ఆ ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం !
బెంగాల్లో ఏం జరుగుతోంది ? ఎడ్జ్ ఎవరికి ఉంది ? మేం గెలుస్తామంటే మేం గెలుస్తామంటూ మమత మోదీ పదే పదే చెప్పుకోవడం కనిపిస్తోంది కానీ, పరిస్థితి మాత్రం ఇప్పటి వరకూ ఏ మాత్రం క్లారిటీ లేకుండా ఉందన్నది వాస్తవం. సర్వేలన్నీ తృణమూల్ కి అనుకూలంగా ఉన్నాయి అన్నది నెల రోజుల నాటి మాట ! ఎందుకంటే సుదీర్ఘంగా ఆరు వారాలపాటు జరుగుతోంది పోలింగ్. ఏడు విడతలు. దశల వారీగా కొట్టాలన్నది కేంద్రం వ్యూహం. బలం, బలగం అంతా దిగింది. పేరుకి సొంత రాష్ట్రమే కానీ ఏ రోజు ఏం జరుగుతుందో తెలియని సీన్ మమతది ! రోజు రోజుకూ బ్యాలెన్స్ మారుతోంది. ఓ రకంగా చెప్పాలంటే 2019లో చంద్రబాబు ఉన్న సీట్లోనే ఇప్పుడు మమత ఉన్నట్టు కనిపిస్తున్నారు. కాకపోతే ఒక్కటే తేడా… బాబుది అంతా డిఫెన్స్. మమత మాత్రం ఫ్రంట్ ఫుట్ ఆడేందుకు ఎప్పుడూ రెడీ !
ఈ నిమిషానికి ఢిల్లీకి ఉన్న అంచనా ప్రకారం చూస్తే… బెంగాల్లో తృణమూల్ అవకాశాలు 60 అయితే… బీజేపీకి 40 శాతం ఉన్నాయట ! ఇది బీజేపీ ఇంటర్నల్ లెక్క. తారుమారు అయ్యే అవకాశాల్ని ఏ మాత్రం తోసిపుచ్చలేం. ఎందుకంటే ఇంకా పదిహేను రోజులు ఉంది దాదాపుగా ! బెంగాల్ లాంటి అతి పెద్ద నాన్ హిందీ రాష్ట్రంలో మొట్టమొదటి సారి బీజేపీకి అధికారం అందడం అంటే దేశవ్యాప్తంగా చాలా ప్రభావం పడుతుంది. వ్యూహాలు మారతాయ్. అన్నిటికంటే ముఖ్యంగా, వ్యవసాయ చట్టాలపై ఢిల్లీలో తీవ్ర ఆందోళనలు జరుగుతూ… హిందీ రాష్ట్రాల్లో జాట్లలో తిరుగుబాటు వచ్చింది అనే అంచనాల సమయంలో బీజేపీ లెక్క సరి చూసుకుంటుంది. బెంగాల్లో గెలిస్తే… ఒకలా… ఓడితే మరోలా ఉంటుంది పాలసీ.
గెలిస్తే… ఊపులో ఊపు జమిలికి మొగ్గు చూపొచ్చు. తలెత్తుతున్న ప్రత్యర్థుల్ని… బలిని తొక్కినట్టు తొక్కచ్చు. పదేళ్లపాటు అధికారంలో ఉండటం వల్ల వచ్చే వ్యతిరేకతను వదిలించుకోడానికి కొత్త అస్త్రాలు బయటపెట్టొచ్చు. రాష్ట్రాల వారీగా స్క్రీన్ ప్లే ఉంటుంది. అదే ఓడితే మాత్రం మరో సినిమా కనిపిస్తుంది. పార్టీలను దగ్గర చేసుకునే దారులు వెదకడం, ప్రత్యర్థులు బలపడేందుకు ఉన్న అవకాశాల్ని దూరం చేయడం, యూపీలో ఇప్పటి నుంచే జాగ్రత్త పడటం ఇవన్నీ ఉంటాయ్. అయితే… బెంగాల్లో బొమ్మ పడినా… బొరుసు పడినా ఖాయంగా జరిగే పరిణామాలు మాత్రం కొన్ని ఉంటాయన్నది బీజేపీ వర్గాలు ఇస్తున్న సంకేతం.
ఓ రాష్ట్రంలో ప్రభుత్వం కూలడం ఖాయం. ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ పూర్తి అయ్యింది అంటున్నారు. ఇప్పటికే అమిత్ షా బృందం అంతా రెడీ చేసింది అనేది టాక్. ఇక ప్రాంతాల వారీగా కూడా స్ట్రాటజీ పదునెక్కుతుంది. ఎక్కడ ఎప్పుడు ఎలాంటి పావులు కదులుతాయో ఊహించలేం అని పాండిచ్చేరీ అనుభవం లేటెస్ట్ గా చెప్పింది కదా ! అదే వరసలో మరో దక్షిణాది రాష్ట్రంలో ఓ పార్టీ విలీనం అయినా కావొచ్చన్నది అంచనా ! అంటే చాలానే మార్పులు ఉంటాయ్… పార్టీల విషయంలోనూ, పార్టీలను, ప్రభుత్వాలను నడుపుతున్న అధినేతల విషయంలోనూ ! అందుకే అంటున్నది బెంగాల్ ఇవ్వబోతున్నది కేవలం అసెంబ్లీ ఎన్నికల తీర్పు మాత్రమే కాదు… దేశ రాజకీయాన్ని మార్చబోయే స్క్రిప్ట్.