33 C
Vijayawada
Friday, April 12, 2024
Homeరాజ నీతి1999 తర్వాత ఆ చంద్రబాబు కనిపించలేదా ? ఎందుకు ?

1999 తర్వాత ఆ చంద్రబాబు కనిపించలేదా ? ఎందుకు ?

నిదానంగా ఉంటాడు. నిందలు మోస్తాడు. పద్ధతి ప్రధానం అంటాడు. దూకుడు తక్కువ. జోకుడు ఎక్కువ. కఠినంగా ఉంటా అంటాడు. ఆ మాటకు కమ్మిట్ అవ్వడు. చేతులెత్తి దండంపెట్టి చెబుతాడు. బతిమిలాడతాడు. ఎదుటోణ్ని ఫుట్ బాల్ ఆడడు – ఇలా చంద్రబాబు మీద చాలా చాలా ఇంప్రెషన్లు ఉంటాయ్ ఈ జనరేషన్ కి ! కానీ ఓ పాతికేళ్ల కిందట చంద్రబాబు వేరు. ఆ జోరు వేరు. ఆ తీరు వేరు. ఆ దరువే వేరు. ఈసారి కూడా మళ్లీ ఈయనే అంటున్నారు. మన వల్ల కాదనిపిస్తోంది – అంటూ అతడు సినిమా ఇంట్రొడక్షన్ సీన్ లో డైలాగ్ కి స్ఫూర్తి కూడా చంద్రబాబేనని కొంత మందికే తెలుసు. అలాంటి బాబు ఇలా ఎందుకు మారాడు ? కారణం ఏంటి ?

94 ఎన్నికల్లో ఎదురులేని విజయం సాధించాక ఓ సారి కాంగ్రెస్ నాయకులు కొందరు ఎన్టీఆర్ మీద అనుచిత విమర్శలు చేశారు. మహిళలకు అన్యాయం చేస్తోంది ఎన్టీఆర్ ప్రభుత్వం అని ఆరోపించారు. అంతే – అసెంబ్లీ సమావేశం ముగిసి బయటకెళ్లే సమయానికి మహిళలు చుట్టుముట్టేశారు ఆ ఆరోపణలు చేసిన వాళ్లని. తప్పు అని ఒప్పుకొని క్షమాపణ చెబితేనే నాంపల్లి చూస్తారు లేదంటే ఇక్కడే ఉంటారని నిలేశారు. చేసేది లేక కాంగ్రెస్సోళ్లు చేతులెత్తి దండంపెట్టి మరీ ఒప్పుకున్నారు. ఇంతటి దూకుడు టీడీపీకి అద్దిన వ్యూహం చంద్రబాబుది. 1995. సీఎం అయ్యాక తనదైన ముద్ర వేయడం కంపల్సరీ. కాలం అదును – తనదైన పదును కలిసి కొత్త వ్యూహం తెర మీదకొచ్చింది. ఎన్టీఆర్ అంతటి పాపులారిటీ తనకి లేదు. కానీ తనదైన ముద్ర ఉంటే చరిత్ర సృష్టించొచ్చు అనే విశ్వాసం ప్రజల వద్దకి పాలన తెచ్చింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో ప్రపంచం తలుపు తట్టింది. హైటెక్ సిటీని మన ముందు పెట్టింది. సీఎం అంటే ఎక్కడో హైద్రాబాద్ లో ఉంటాడు అనుకునే ఆలోచనల్ని బద్దలుకొట్టి ఆకస్మిక తనిఖీతో అదరగొట్టాడు.

గొర్రె తోకంత ఏపీ బడ్జెట్ ని బారెడు చేయడం, టాప్ ఫైవ్ ఎర్నింగ్ స్టేట్స్ లో ఒకటేమో అనిపించే స్థాయిలో పెర్ఫామెన్స్ చూపించడం, ఐటీ, హైటెక్, హైదరాబాద్ కి హంగులు, బిల్ గేట్స్, బెంగళూర్ ని ఓవర్ టేక్ చేయడం, ఇండియాస్ బెస్ట్ సీఎం, కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి సాయం తేవడం – ఇలా లిస్టు చాలానే ఉంటుంది. 99లో రెండోసారి గెలిచాక ఇదే హ్యాంగోవర్ కంటిన్యూ అయ్యింది కానీ టెంపర్ మెంట్ లో ఛేంజ్ వచ్చేసింది. విజన్ 2020 అనే ఉరుకు మొదలైంది. రాజకీయంలో కరుకు తగ్గింది. ఇవాల్టి గురించి ఎవడైనా ఆలోచిస్తాడు. రేపటిని డిసైడ్ చేయాలనే ఆలోచన బలపడింది. అది కాస్తా ముదిరి చరిత్రలో నిలిచిపోవాలన్న కుతూహలం పెరిగింది. బలం తగ్గింది.

అది పెరిగితే ఇది తగ్గడం ఎందుకు అంటారా ? ఎస్. అదే పాయింటు. చుట్టూ ఉన్నవాళ్లు ఏం చేస్తున్నారో చూసుకోకపోయే సరికి వేరు కుంపటి పుట్టింది. 2020 మోజు బలబలాల్ని కమ్మేసింది. లి క్వాన్ యు తరహాలో స్టేట్ ని సింగపూర్ చేయాలన్న తపన… రాజకీయంలో తడి ఇంకిపోయేలా చేసింది. సన్నిహితులు చెప్పేందుకు ప్రయత్నించినా – అధికారం తెచ్చింది నేను, నేను చేసి చూపిస్తాను అనేంతగా పెర్ఫామెన్స్ ఓరియెంటేషన్ డామినేట్ చేయడం మొదలు పెట్టింది. ఇదే అదునుగా పుకార్లు పుట్టాయ్. దక్షిణాది ప్రాజెక్టుల్లో నీటి చుక్కలేని, ఒక్క పంట పండటమే గగనం అనిపించే గడ్డు పరిస్థితుల్ని వాటంగా అధిగమించిన రోజులవి నిజానికి. ధరలు పెరగక పోవడమే పరిపాలనకి పారామీటర్ అనుకుంటే బహుశా ఏపీ హిస్టరీలోనే అదో బెస్ట్ ఎరా ! అంతా అనుకూలంగా ఉన్నప్పుడు కూడా చేతగాక చేతులెత్తేసి అప్పులు పోగేస్తున్న అసమర్థతో పోలిస్తే కరువు కాలంలోనూ నాటి పెర్ఫామెన్స్ వరల్డ్ క్లాస్. అయినా ఇవన్నీ మరుగున పడిపోవడానికి కారణం ఒక్కటే ! నేటి సంగతి సరే – రేపటి చరిత్రలో మిగిలిపోవాలన్న ఆరాటం. ఈ పోరాటంలో నాటి చంద్రబాబు క్రమంగా వెనకబడ్డాడు.

అడుగుల్లో వేగం తగ్గింది. రాజకీయంలో దూకుడు తగ్గింది. నేను కేవలం పని చేయాడానికి పుట్టినోణ్ని అనే నమ్మకం ఎక్కువైంది. అవకాశాలు అందుకోడానికి ఎగిరి ఎగిరి జిరాఫీ మెడ పెరిగిందని పరిణామ సిద్ధాంతం చెబుతుంది. అవకాశాలు అందుకోవాలన్న తాపత్రయం తగ్గి, తనకి తాను విధించుకున్న పరిమితులు పెరిగి నేటి చంద్రబాబు మన కళ్ల ముందు నిలిచాడనేది రాజకీయ పరిణామ క్రమం. ప్రత్యర్థిని గుక్క తిప్పుకోనివ్వని చంద్రబాబు కాదు ఇప్పుడున్నది. ప్రత్యర్థులు ధ్వంసం చేసిన రాష్ట్రాన్ని పట్టాలెక్కించడానికి మాత్రమే పనికొచ్చే పనిమంతుడు మాత్రమే. అందుకే, అవి మాత్రమే చేసేందుకే 2014లో అవకాశం ఇచ్చింది. మళ్లీ మరో రెండేళ్లలో అదే తోవ కనిపిస్తోంది. ఈ చంద్రబాబు కేవలం పని మాత్రమే చేస్తాడు. రొచ్చు రాజకీయాలు, రచ్చ పనులు చేయలేడు. చేయడు. ఇప్పటికైనా అవకాశం వస్తే 2050 నాటికి ప్రపంచస్థాయి ఆంధ్రప్రదేశ్ అంటాడు తప్పితే ఎదుటున్న అరాచకుణ్ని తుంచి, పెకలించి పక్కన పడేయాలన్న కసి చూపించడు. ఇంత చూశాక, ఇన్నేళ్లు తిరగేశాక ఒక్కటే అనిపిస్తోంది. మన కోసం ముందుకెళ్లి ఆలోచించి – తన కోసం తాను ఆలోచించడం మానేసి వెనకబడిన ఛాంపియన్ గా చంద్రబాబు మిగులుతాడేమో !

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments