29 C
Vijayawada
Friday, August 21, 2026
Homeఆంధ్రప్రదేశ్వివేకా కేసులో ఊహించని మలుపు రంగంలోకి ఈడీ.. బిజెపి హ్యాండిచ్చిందా!

వివేకా కేసులో ఊహించని మలుపు రంగంలోకి ఈడీ.. బిజెపి హ్యాండిచ్చిందా!

తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేసిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి ఏడేళ్లు దాటిపోయింది. సిబిఐ ఏడేళ్లుగా విచారించి, ఇక విచారించాల్సిన అవసరం లేదని కోర్టుకు చెప్పింది. సిబిఐ ఈ నివేదిక ఇవ్వడం వెనుక రాజకీయ వత్తిళ్లున్నాయన్న విమర్శలు వచ్చాయి. ఈ కేసులో ఇంకా అనుమానితులున్నారని, వాళ్లని కూడా విచారించాలని వివేకా కుమార్తె సునీతారెడ్డి వేడుకోళ్లని ఎవరూ పట్టించుకోలేదు. ‘కేసు దర్యాప్తు ఎందుకు ఆగిపోయింది?’ అంటూ ఆమె స్వయంగా మీడియా ముందుకు వచ్చి ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఒక ఆడబిడ్డ ఒంటరి పోరాటం ప్రజల మనసులని కదిలించింది కానీ వ్యవస్థలను కదిలించలేకపోయింది. జగన్ మీద వున్నకేసుల్లాగే ఇది కూడా తయారవుతుందని, ఇందులో నిందితులుగావున్నవాళ్ల కొంపలేమీ మునగవని, జనమంతా ఒక అంచనాకు వచ్చేశారు.అయితే వూహించని విధంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అంటే ED ఎంట్రీ ఇచ్చింది. హైదరాబాద్, కడపలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నివాసంతో సహా 6 చోట్ల ఈడీ అధికారులు సోదాలు చెయ్యడం సంచలనంగా మారింది. వివేకా హత్యకేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ.. గతంలో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చూస్తే, అప్పటి అధికార వైసీపీ సర్కార్ ముప్పు తిప్పలు పెట్టింది.

విచారణ జరపుతున్న అధికారి మీదే కేసులు పెట్టారు. విచారణకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. అవినాష్ రెడ్డిని అరెస్టు చెయ్యడం సిబిఐ తరం కాలేదు. ఎంపీ అవినాష్ రెడ్డిని విచారించేందుకు సీబీఐ నోటీసులు జారీ చేసిన ప్రతిసారీ హైడ్రామా నడిచింది. కర్నూలు ఆస్పత్రి ఎపిసోడ్ మనందరికీ గుర్తే. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సీబీఐ అధికారులు వెళ్తే.. వందలాది మంది వైసీపీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి అడ్డుకున్నారు. శాంతిభద్రతల సమస్యను సాకుగా చూపి అప్పటి రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కూడా సీబీఐకి సహకరించలేదు. అప్పటి రాష్ట్ర పెద్దల ఆదేశాలతోనే పోలీసులు సహకరించలేదు.

కేంద్రంలో బిజెపి పెద్దల మద్దతుతోనే వైసిపి సర్కార్ సిబిఐకి సహకరించలేదన్న ఆరోపణలు వచ్చాయి. సీబీఐ చేయలేని పనిని ఈడీ చేయగలుగుతుందా? అసలు ఏడేళ్ల తర్వాత కేంద్ర ఆర్ధిక శాఖ ఆధీనంలోని ఈడీ ఎందుకు రంగంలోకి దిగింది? ఇందులో రాజకీయ ప్రమేయం వుందా? అవినాష్ రెడ్డిని ఈడీ అరెస్ట్ చేయగలదా అన్న ప్రశ్నలు, సందేహాలు తలెత్తుతున్నాయి. వివేకా హత్య కేసులో 100 కోట్లకు డీల్ కుదిరిందని సిబిఐ తన విచారణలో తేల్చింది. ఇందులో నాలుగు కోట్లు అవినాష్ రెడ్డి ద్వారా ఈ డబ్బు నిందితులకు చేరిందన్న ఆరోపణలున్నాయి. సీబీఐ కేవలం ‘హత్య,నేరపూరిత కుట్ర’ అనే కోణంలో దర్యాప్తు చేసింది.

సుపారీ డబ్బు ఎక్కడ నుంచి ఎక్కడకు చేరింది? ఎలావచ్చిందన్న విషయం మీద దర్యాప్తు కోసం ఈడీ రంగంలోకి దిగింది. ఏ బ్యాంక్ ఖాతాల నుండి ఏ అకౌంట్లకు బదిలీ అయ్యాయి? దీని వెనుక ఉన్న హవాలా లేదా మనీలాండరింగ్ నెట్‌వర్క్ ఏంటి? అనే అంశాలపై దర్యాప్తు చేస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్, పులివెందులలో అవినాష్ రెడ్డి ఇంట్లో, అలాగే ఇతర నిందితుల ఇళ్లలో సోదాలు చేస్తోంది. ఇప్పుడు అసలు ప్రశ్న.. ఇన్నేళ్ల తరువాత ఈ కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల ఆరాలు తియ్యగలుగుతారా? సీబీఐ అరెస్ట్ చేయలేకపోయిన అవినాష్ రెడ్డిని ఈడీ అరెస్ట్ చేయగలదా? చట్టపరంగా చూస్తే.. సీబీఐ కేసులో నిందితులకు బెయిల్ రావడం సులువు.

కానీ పీఎంఎల్ఏ చట్టం కింద ఒకసారి ఈడీ కనుక ఎవరినైనా అరెస్ట్ చేస్తే.. వారికి బెయిల్ రావడం కష్టం. పైగా ఇప్పుడు కేంద్రంలో అధికారంలో వున్న బిజెపి తెలుగుదేశంతో జతకట్టి వుంది. జగన్ అధికారంలో లేడు కాబట్టి గతంలో లాగా దర్యాప్తులకుఅడ్డుపడలేరు. ఈ మనీలాండరింగ్ లో అవినాష్ రెడ్డి ప్రమేయం వున్నట్టు బలమైన ఆధారాలు లభించాయంటే నేరుగా కస్టడీలోకి తీసుకునే అవకాశం వుంటుంది. వివేకా హత్య కేసులో ఈడీ రంగంలోకి దిగడం రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా వైసిపిలో చర్చనీయాంశమైంది. తీగ లాగితే డొంక కదిలినట్టుగా ఇదిఎటు నుంచి ఎటు పోతుందో అన్నఆందోళనలో వైసిపి నేతలున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా బిజెపి గతంలో లాగా సహాయపడుతుందా? లేక వదిలేస్తుందా అన్న అంశంమీదే చర్చ జరుగుతా వుంది. బిజెపి వదిలేసిందంటే ఈ కేసులో అవినాష్ రెడ్డికి ఇబ్బందులు తప్పవు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments