33 C
Vijayawada
Tuesday, February 27, 2024
Homeచాణక్య నీతివడ్డీతో సహా చెల్లిస్తామని వార్నింగ్ ఇవ్వడం కరెక్టేనా ?

వడ్డీతో సహా చెల్లిస్తామని వార్నింగ్ ఇవ్వడం కరెక్టేనా ?

ఇలా ఎవరిని ఎవరు ఎవరిని అంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదుగా ! కొడుతున్న వాళ్లని పడుతున్న వాళ్లు అంటారు. దెబ్బ పడిన ప్రతీసారీ ఈ వార్నింగ్ పదే పదే వినిపిస్తోంది. టీడీపీ నాయకత్వం, నాయకులే కాదు ఇప్పుడు టీడీపీ అభిమానులు కూడా ఇలాంటి వార్నింగులు ఇవ్వడం మొదలు పెట్టేశారు. కుప్పం గెస్టు హౌసులో కరెంటు ఆపేశారట. మళ్లీ అదే రిపీట్. వడ్డీతో సహా చెల్లిస్తాం అని ! ఇంతకీ ఇలా అనడం కరెక్టేనా టీడీపీ డీఎన్ఏ ఏం చెబుతోంది ? ట్రాక్ రికార్డు ఎలా ఉంది ?

టీడీపీ కార్యకర్తల మీద దాడులు జరిగాయ్. వడ్డీతో సహా చెల్లిస్తాం అన్నారు. నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకున్నారు. ఓ ఎలక్షన్ కూడా బహిష్కరించింది పార్టీ. అదే డైలాగ్ కొట్టింది. వడ్డీతో సహా చెల్లిస్తాం అని. చంద్రబాబు ఇంటి మీద దాడి, ఆ తర్వాత పార్టీ ఆఫీసులపై దాడులు. అన్నిటికీ రిపీట్ పడుతోంది. ఇంతకీ అలా చెల్లించే ఆలోచన, తెగింపు టీడీపీకి ఉన్నాయా ? చెక్ చేద్దాం ! వాస్తవాలు ఓ సారి చూస్తే అద్దంలో మొహంలాగా అర్థం అయిపోతుంది సినిమా అంతా !
టీడీపీ ముందు నుంచి బాధితుల పార్టీ. బడుగుల పార్టీ. గెలిచిన ప్రతీసారీ మూడొంతుల ఓట్లు వాళ్లవే ! ఓడారంటే వాళ్లు వేయలేదని అర్థం. అది వేరే స్టోరీ. బాధితుల, బడుగుల పార్టీ కాబట్టి భరిస్తూ వస్తోంది. పాతికేళ్లుగా ఇది నడుస్తున్న చరిత్ర. టీడీపీ పుట్టిన మొదటి పుష్కర కాలం అసలు ఆ లైనే వేరు. బ్రదర్… మీరు చూచుకోండి అనే డైలాగ్ ఆయన నోటి వెంట అలవోగా వచ్చేసేది. అధికారంలో ఉన్నా అప్పొజిషన్ లో ఉన్నా… ఆయన పొజిషన్ లో మాత్రం తేడా ఉండేది కాదు. చంద్రబాబు వచ్చాక పంథా మారిపోయింది. మా సహనాన్ని పరీక్షించకండి అంటాడే కానీ పరీక్షిస్తే ఏం చేస్తాడో చెప్పడు. పోనీ చేసీ చూపించడు. అదే సమస్య. అందుకే టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న ప్రతీసారీ తీవ్రంగా అవస్థ పడుతోంది. పరిటాల, సూరీడు లాంటి నాయకుల్ని పోగొట్టుకున్నదీ, దాడులు, కేసులు ఎదుర్కొంటున్నదీ ఇందుకే !

ఓపెన్ గా మాట్లాడుకుందాం. ఇంతకన్నా ఏం చేస్తాడు అనే కదా అంటారిప్పుడు ! చేయొచ్చు. అధికారంలో ఉన్నప్పుడు జాగ్రత్త పడొచ్చు. కఠినంగా ఉండాల్సినప్పుడు ఉండొచ్చు. అలా ఉంటే వ్యవస్థల్లో చలనం ఉంటుంది. భయం ఉంటుంది. మళ్లీ బాబు వస్తే చర్యలు కఠినంగా ఉంటాయన్న సోయి ఉంటుంది. ఉదాహరణలు చాలానే ఉన్నాయ్. చంద్రబాబు పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చాక కూడా లిబరల్ గా ఉండటానికే మొగ్గు చూపాడు, ఆధారాలు ఉన్నా నెల్లూరు బెట్టింగ్ లాంటి చాలా కేసుల్ని లూజుగా వదిలేశాడు. బెజవాడలో మందులో సైనేడ్ కలిపిన కేసు, తుని తగలబెట్టిన కేసు ఏమైపోయాయో తెలియదు. నడి రోడ్డు మీద కాల్చినా తప్పు లేదు అన్నా మొత్తుకున్నాడే తప్ప అంతకు మించి ముందుకు పోలేదు. బహుశా ఏమైనా చర్యలు తీసుకుంటే అవతల వ్యక్తికి సానుభూతి వస్తుందని ఆలోచించి ఆగి ఉండొచ్చు. ఇవొక్కటే కాదు ఇంకా చాలా ఉన్నాయ్. అధికారంలో లేనప్పుడు వెంటాడిన బ్యూరోక్రాట్లను అందలం ఎక్కించాలన్నా, అద్భుతంగా గౌరవించాలన్నా చంద్రబాబుకే సాధ్యం. సపోజ్… ఆర్థిక వ్యవహారాలు తెలిసిన వైఎస్ నమ్మిన బంటు లాంటి అధికారి ఒకాయన ఉండేవాడు. ఆయనకు మనం పదవి ఇవ్వొద్దూ అని చాలా మంది మొత్తుకున్నారు. బాబు మాత్రం తాను చేయగల్గినంతా చేసి, అత్యున్నతంగా రిటైర్ అయ్యేలా చూశాడు. వాళ్లు చేసిన తప్పు వాళ్లే తెలుసుకుంటారు అని భగవద్గీత చెప్పాడు కూడా ! తీరా ఏమైంది. అదే అధికారి పోయిన ఎన్నికల ముందు పుస్తకం రాసి… వైఎస్ అభిమానుల్ని ఏకం చేసి బెజవాడలో సభలు పెట్టి హల్ చల్ చేశాడు. ఇలాంటి ఉదాహరణలు వంద చెప్పొచ్చు. పైగా పెచ్చు… అధికారంలో ఉండగా రాజకీయంగా బలపడటం, కొరుకుడు పడని గుడివాడ లాంటి చోట్ల పార్టీకి ఊపిరి పోయడం లాంటివి అయినా చేస్తారా అదీ ఉండదు. జస్టు 15 రోజుల ముందు అభ్యర్థి ఎంపిక అవుతాడు. అదీ కథ.

మరి ఇలాంటి వ్యవహారాలన్నీ పెట్టుకొని ఇప్పటిప్పుడు వడ్డీలూ చెల్లింపులూ అంటే అయిపోతుందా ? హౌ ? ప్రైవేటు కేసులు పెడతాం, వేధింపుల్ని తిప్పికొడతామని ఏడాది కింద చెప్పారు. పెట్టారా ? ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయ్. ఈసడించడం, దెప్పి పొడవడం కాదు ఇక్కడ ఉద్దేశం. వాస్తవాలు చెప్పడం. టీడీపీ ఎప్పుడూ తట్టుకునే పార్టీ. తట్టుకొని, ఉగ్గపట్టుకొని ఉండటమే టీడీపీ బలం. ఉమ్మడి రాష్ట్రంలో 43 సీట్లకు పడిపోయి కూడా లేచింది ఇలాగే ! టీడీపీ పోరాటం బాక్సింగ్ రింగ్ లో ఫైట్ లా ఉంటుంది. ఒక దెబ్బ కొట్టడం ఎంత ముఖ్యమో పది దెబ్బలు తట్టుకోవడం కూడా అంతే ముఖ్యం అనేది బాక్సింగ్ లో చెప్పే మాట. టీడీపీ అలాగే తట్టుకుంటుంది. టైమ్ వచ్చినప్పుడు నాకౌట్ పంచ్ ఇస్తది. అధికారం వస్తది. అంతే… అప్పులూ, వడ్డీలూ ఏం ఉండవ్ అప్పుడు.

కాకపోతే ఒక పని చేయొచ్చు. వడ్డీలూ చెడ్డీలూ మన వల్ల కాదు కానీ, కష్టకాలంలో నిలబడిన కార్యకర్తలకి గుర్తింపు ఇవ్వొచ్చు. దెబ్బలు తిని తట్టుకున్న వాళ్లని ఎలా గుర్తించాలో అలా గుర్తించొచ్చు. దెబ్బ కొట్టిన వాళ్లు తప్పుడు పని చేసి దొరికితే వదిలి పెట్టకుండా గట్టిగా పట్టుపట్టొచ్చు. నిస్పాక్షికంగా లేకుండా వెంటాడిన బ్యూరోక్రాట్లను గుర్తు పెట్టుకోవచ్చు. ఇలాంటివి చేయొచ్చు. అంతే తప్ప… డైలాగులు కొట్టడం వల్ల పెద్ద లాభం లేదు. పైగా కొంత మందికి నచ్చకపోవచ్చు కూడా ! ఎలాగంటారా… వాళ్లు అరాచకం చేస్తున్నారని కదా మీరు తప్పు పడుతున్నది, వాళ్లు కొడుతున్నారని కదా ఢిల్లీ వరకూ పోయి కంప్లైంట్లు చేస్తున్నది, వాళ్లు వేధిస్తున్నారు అని కదా మీరు భోరుమంటున్నది. మేం వచ్చాక అంతకు అంతా మేమూ చేస్తామంటే… వాళ్లకూ మీకూ తేడా ఏముంది అని ఎవరైనా అఢిగితే చెప్పడానికి సమాధానం ఉందా అనేది ప్రశ్న.

ఇంత చెప్పిన తర్వాత కూడా ఇంకా వాదించే ఆశావాదులు కొందరు ఉంటారు. మరికొందరు అయితే ఇంకో అఢుగు ముందుకేసి మిర్చి సినిమా డైలాగు చెబుతారు. ఇప్పటి వరకూ ఓ లెక్క. ఇప్పటి నుంచి మరో లెక్క అని. లెక్క ఎప్పుడూ అదే. పక్కా. తప్పుతున్నది చాలా మంది కేలిక్యులేషన్లే. వడ్డీ ల డైలాగులు అన్నీ కార్యకర్తల్లో ధైర్యం నింపడానికి చెబుతున్నట్టుగానే అర్థం చేసుకోవాలి. అంత వరకూ అయితే పర్లేదు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments