23.8 C
Vijayawada
Saturday, December 9, 2023
Homeజాతీయ నీతిమమత తీరు దేశానికి డేంజరా ?

మమత తీరు దేశానికి డేంజరా ?

శత్రువు మన ఇంటి మీదకి దండెత్తితే రక్షించుకోవడం, తిప్పికొట్టడం వేరు. అదే మనకంటే బలమైన ప్రత్యర్థి ఇంటి మీదకి దండయాత్ర ప్రకటించి విరుచుకు పడాలనుకోవడం వేరు. ఈ తేడా మమత మర్చిపోతున్నట్టు కనిపిస్తోంది రాజకీయ హడావుడి చూస్తుంటే ! చికెన్ లేకుండా కోడి కూర చేసి చూపిస్తా అని సవాల్ చేసినట్టు – ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ లేకుండా ప్రతిపక్ష కూటమిని కొత్తగా కట్టి చూపిస్తా అని మమత ప్రకటించడం చూస్తే దేశ రాజకీయం ఎటు పోతున్నట్టు ? ఇలాంటి ప్రయత్నాలు వచ్చే ఎన్నికల్లో రాజకీయాన్ని ఎటు నుంచి ఎటు తిప్పే అవకాశం ఉందో చూద్దాం !

బీజేపీకి దూరంగా ఉన్న యశ్వంత్ సిన్హా తృణమూల్ లో చేరారు. కాంగ్రెస్ ను వదిలి కీర్తీ ఆజాద్ కూడా అదే పని చేశారు. సుబ్రమణ్యస్వామి కూడా రేపోమాపో ఇలాగే చేయొచ్చు అంటున్నారు. త్రిపురలో కాంగ్రెస్, లెఫ్టు పార్టీలను ఖాళీ చేసింది తృణమూల్. అటు పక్కనున్న చిన్న రాష్ట్రం మేఘాలయాలో ప్రధాన ప్రతిపక్షం మేమే అని ప్రకటించుకుంది మమత పార్టీ. ఇక గోవా ఎన్నికల్లో గెలిచి చూపిస్తాం అని సవాల్ కూడా చేస్తోంది. ఇక దేశవ్యాప్త దండయాత్రే అంటూ తృణమూల్ – కాంగ్రెస్ ని నామరూపాల్లేకుండా చేస్తాం అంటోంది. సాధ్యమేనా ? కాంగ్రెస్ నుంచి పుట్టిన పార్టీ కాబట్టి కాంగ్రెస్ మీద అంత ఏహ్యభావం ఉండటం సహజమేనేమో ! కాంగ్రెస్ కనీసం మాట వినడం లేదు అని ఆగ్రహించడం వరకూ ఓకే. అలాగని బీజేపీని గెలిపించే ఎత్తుగడలు వేయడం ఏంటనేదే ప్రశ్న. మమత దేశంలోనే అత్యంత శక్తిమంతురాలైన విపక్ష లీడర్. సందేహం లేదు. మోడీ అండ్ కో మీద యుద్ధం ప్రకటించి, గెలిచి నిలిచిన ఏకైక సీఎం కూడా ! మోడీ మీద యుద్ధం చాలా మంది ప్రకటించారు కానీ వాళ్లెవరూ గెలవలేదు. గెలిచినా అదే మాట మీద లేరు. కావాలంటే పొరుగు రాష్ట్రం చూడండి. నితీశ్ ని అడగండి. అందుకే మమతకు కొంత క్రేజ్. వాస్తవం. అలాగని విల్లు లేకుండా బాణం విసరడం వీలవుతుందా ? ప్రధాన ప్రతిపక్షం లేకుండా ప్రతిపక్ష కూటమి సాధ్యపడుతుందా ? మమత లాజిక్ మర్చిపోయినట్టు ఉన్నారు. ఏకంగా ఓ యజ్ఞం మొదలు పెట్టేశారు.

మమత ఇలాంటి అశ్వమేథ యాగాలు చేయడం ఇదే మొదటిసారి కాదు. 2014లో మోడీ మీద వారణాసిలో తృణమూల్ అభ్యర్థిని నిలబెట్టిన విషయం కొంతమందికే తెలుసు. మోడీ వర్సెస్ కేజ్రీవాల్ గా ఉన్న ఆ ఎన్నికలో తృణమూల్ హిందూ మహా సభతో పేరు ప్రఖ్యాతులున్న ఇందిరామిశ్రాను రంగంలోకి దించింది. ఓట్లు చీలాయ్. కేజ్రీకి రావాల్సినంత మైలేజీ రాలేదు. గెలుపు ఎలాగూ ఉండదని తెలిసిందే. అది వేరే సంగతి. ప్రాంతీయ పార్టీ ప్రతీ చోటా ఎగబడటం మొదలు పెడితే ఇలాగే ఉంటుందనడానికి ఇదో రుజువు. అసలు కాంగ్రెస్ ను కాదని విపక్షం కూటమి కట్టే పరిస్థితి ఇప్పుడు ఉందా ? సాధ్యమా ? హిందీ బెల్ట్ తోపాటు దక్షిణాదిలో కూడా ప్రాంతీయ పార్టీలు బలంగానే ఉన్నా కాంగ్రెస్ ఇప్పటికీ సిగ్నిఫికెంట్ ఫోర్సే. బీజేపీకి దాదాపు 33 శాతం ఓట్లు ఉంటే – కాంగ్రెస్ ఇప్పటికీ 23 శాతానికి కాస్త అటూ ఇటుగా ఉంది. అంటే ఓట్ల తేడా పది శాతం. మరే పార్టీ ఈ రెండింటికీ దరిదాపుల్లో కూడా లేదు. పైగా కనీసం 350 స్థానాల్లో బీజేపీని నేరుగా ఢీ కొట్టేది కాంగ్రెస్సే. జనం నిశ్చితమైన అభిప్రాయానికి వచ్చినప్పుడు ఇది ఎటు నుంచి ఎటు అయినా మారొచ్చు. బీజేపీని ఓడించాలి అని జనం అనుకుంటే మాత్రం గరిష్టంగా లాభపడేది కాంగ్రెస్సే.

యూపీలో అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచి రంగంలోకి దిగారు మోడీ. ఒక్క రోజులో ఐదు డ్రెస్సులు మార్చి విభిన్న ప్రదేశాల్లో ఫోటోలకి ఫోజులిచ్చి అర్థరాత్రి కూడా కెమెరాలకు కునుకు లేకుండా తనిఖీ చేశారు. ఓ విజన్, ఓ ప్లానింగ్, ఓ పద్ధతి ఉన్న రాజకీయం అలా ఉంటుంది. అలాంటప్పుడు అక్కడ బీజేపీని కొట్టే బలం ఎవరికి ఎక్కువ ఉందో లెక్క తేల్చి వాళ్లకి ముందు ఛాన్సిచ్చి మిగతా వాళ్లు సర్దుకోవాలి. అంతేకానీ బెంగాల్లో నేను ఇరగ దీశా కదా అని యూపీలో ఎగిరి గెంతుతా అంటే కుదరదు. కుస్తీలో గెలిచేశా కదా ఇక కబడ్డీ కూడా ఆడతా అనకూడదు. సుస్తీ చేస్తది. పంజాబ్ లో బీజేపీ ఎత్తుగడ క్లియర్. అమరీందర్ పార్టీ వచ్చింది. రైతు చట్టం అటకెక్కింది అందుకే. అలాంటి చోట్ల కూడా కాంగ్రెస్ కి వెన్నుపోట్లు పొడవాలి అనుకుంటే బీజేపీని బతికించినట్టే. ఇలాంటి సూక్ష్మాలు అర్థం చేసుకునేంత పరిజ్ఞానం ప్రాంతీయ పార్టీకి ఉండాలని ఆశించలేం. కాకపోతే – తాను పెట్టిన బేరానికి కాంగ్రెస్ ఒప్పుకోలేదని ప్రశాంత్ కిషోర్ ఆడిస్తున్న ఆట ప్రకారం మమత అడుగులు వేస్తున్నారు అనుకోవాలి. తన బాగు కోసం ఎవరిని ఎంత పతనం చేయాలో అంతా చేస్తాడు ప్రశాంత్ కిషోర్ అని ఆంధ్రా వాళ్లకి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా !

 

ఇలాంటప్పుడు, నిజంగా బీజేపీని ఓడించాలి అనుకుంటే మమత చేయాల్సింది ఇప్పుడు చేస్తున్న వ్యూహ రచన కాదు. ప్రశాంత్ కిషోర్ కి నచ్చలేదనో, మమత ఈగోకి తీసుకుందనో కాంగ్రెస్ ను దెబ్బతీయాలీ అనుకుంటే మొత్తం విపక్షం నష్టపోతుంది. బీజేపీ లాభపడుతుంది. కాంగ్రెస్ ఆల్రెడీ నేలబారుగా ఉంది. పట్టు మని 50 సీట్లు కూడా లేవు. ఇంతకంటే దిగజారే పరిస్థితి ఉండనే ఉండదు. ఈ లెక్కన చూస్తే మమత వ్యూహాలతో ఆల్టర్ నేటివ్ రాజకీయం రాకపోగా – ఆల్టర్ నేటివ్ పొలిటికల్ థాట్ కే దెబ్బ పడే ప్రమాదం ఇప్పుడు పొంచి ఉంది. ఎన్నికలకి ఇంకా కనీసం రెండున్నరేళ్ల సమయం ఉంది. ఇప్పటి నుంచి హడావుడి చేసి ఎన్నికలకు ఏడాది ముందు చల్లబడితే పర్వాలేదు. కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను కుళ్లబొడిచి – జనరల్ ఎలక్షన్ లోనూ అలాగే చేద్దామని అనుకుంటే మాత్రం మమత ఓ రాజకీయ తప్పిదం చేసినట్టే !

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments