23.8 C
Vijayawada
Saturday, December 9, 2023
Homeరాజ నీతిపెత్తందారు కాదు చంద్రబాబు ధర్మకర్త

పెత్తందారు కాదు చంద్రబాబు ధర్మకర్త

పెత్తనం దొరికింది అనుకునేవాడు పెట్రేగిపోతాడు. రేపన్నది లేదన్నట్టు రెచ్చిపోతాడు. కూలుస్తాడు. తేల్చేస్తానంటాడు. అన్నింటా తెగించి ముగింపు వైపు పరిగెడతాడు. ధర్మకర్త అలా కాదు. కాపాడటం, నిలబెట్టడం, భవిష్యత్తు వైపు నడిపించడం మాత్రమే ధర్మకర్త డ్యూటీ. నిమిత్తమాత్రుణ్ని అంటూనే విపత్తులకి, వైపరీత్యాలకి ఎదురు నిలిచి… వెనకున్న వాళ్లని ముందుకు నడిపిస్తాడు. దారి చూపడమే ధర్మకర్త బాధ్యతని భావిస్తాడు. చంద్రబాబు ఎందుకు ఎగిరి దూకడం లేదు ? అధికారం వచ్చినప్పుడే ఇలాంటి వాళ్లని చెండాడి ఉంటే ఇప్పుడు ఇలా ఉండేదా – అంటూ పూటకో ప్రశ్న విసిరే వాళ్లకి ఇదే సమాధానం. ఎందుకంటే, చంద్రబాబు పెత్తందారు కాదు ధర్మకర్త.

అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు తీరిగ్గా చాపుకొని కూర్చోడు. వెనక్కివాలి విరగబడి నవ్వడు. కుర్చీలో ముందుకు జరిగి చివరి అంచులో ఆనుతాడు అంతే ! నేరుగా చూసిన వాళ్లకి అనుభవమే. ఎందుకు సార్ అలా అంటే – ఉదయం నుంచి రాత్రి వరకూ మనం పని చేస్తూనే ఉండాలి కదమ్మా, ఫిట్నెస్ కూడా ఇంపార్టెంట్. ఆనుకొని రిలాక్స్ అయితే పని మీద ఫోకస్ తగ్గుతుందని ఇలాగే అలవాటు అని సిగ్గు ఆపుకుంటూ చిరునవ్వుతాడు. అంటే అధికారాన్ని ఆస్వాదించడు. బాధ్యతగా భావిస్తాడు. అందుకే అనుక్షణం అలర్ట్ గా ఉంటాడు. పవర్ చేతిలో ఉన్నప్పుడు పొంగిపోయినట్టు కనిపించడు కాబట్టేనేమో ఓడిపోయినప్పుడు కూడా కుంగినట్టు అనిపించడు. ఇదే చంద్రబాబు ఫిలాసఫీ. ఓడిపోవడం అంటే లగాయించి పని చేయడానికి వచ్చిన మరో అవకాశం అనుకునేవాణ్ని ఎవడు మాత్రం ఏం చేస్తాడు ! మోకులేసి కట్టినా ఆగడు. మేకులు కొట్టి శిలువ కట్టాలనుకున్నా లేచొస్తాడు. గెలిచొస్తా అని సవాల్ చేస్తాడు – తప్పదు చూస్తుండాలి.

చంద్రబాబుకి ఓ సీజన్ ఉంటుంది. తన్నులాటతో విసుగెత్తి పోయినప్పుడో, ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలోకి దిగజారిపోయినప్పుడో, దారీతెన్నూ తెలియనప్పుడో దిక్సూచి లాగా దిగుతాడు. కాదు కాదు.. జనమే దింపుతారు చంద్రబాబును రంగంలోకి. గెలిపిస్తారు. కావాలంటే చరిత్ర తిరగేయండి. పార్టీ ఎటు పోతోందో తెలియని సమయంలో స్టీరింగ్ అందుకున్నాడు. ఓ జాతి ఏమైపోతుందో అనే ఆందోళనలున్న 2014లో మళ్లీ వచ్చాడు. వస్తాడు. నిలబడతాడు. నిలబెడతాడు. నిందలేస్తారు. మోస్తాడు. దిగిపోతాడు. నాలుగు ముక్కల్లో చెప్పాలంటే చంద్రబాబు రాజకీయం ఇంతే ! హైటెక్ సిటీ కడుతున్నప్పుడు సొంత వాళ్ల ఆస్తులు పెంచడానికన్నారు. కాదు అని కరాఖండీగా చెప్పలేకపోయాడు. ఓడాడు. పది ఇరవైళ్లు దాటాక ఇప్పుడు కనిపిస్తోంది ఆ ప్రభావం. భావితరాల కోసం నిర్మించిన నవీన నగరం సైబరాబాద్ అని ! అమరావతి కూడా అలాంటిదే. కట్టాలనుకున్నప్పుడు తిట్టాలనుకున్నారు కొందరు. దించేశారు. దిగాడు.

బహుశా చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చి ఉన్నా అమరావతికి ఇంత పబ్లిసిటీ వచ్చేది కాదేమో ! ఎందుకంటే ప్రపంచ స్థాయి స్థాయి అంటూ నిరంతరం అదే ఘోషలో తాను కొట్టుమిట్టాడుతుండేవాడు. ఇప్పుడైతే ఉందో ఆగిందో తెలియని స్థితి కాబట్టి నిరంతరం అదే పేరు మోగుతోంది. రావాలి కావాలి… కట్టాలి అని జనం కోరుకునే మూడ్ ఎగువ నుంచి దిగునవ కాళహస్తి కాదా వచ్చేసింది. అంటే ఎదుటివాళ్లకి ఇక కాళరాత్రే ! రాజధాని వాళ కాకపోతే రేపైనా కడతాడు. కానీ ఈ మోస్తరు పబ్లిసిటీ అయితే చంద్రబాబు వల్ల కాదు. పరిస్థితి ఇలా కలిసి రావాల్సిందే ! చంద్రబాబు అధికారాన్ని ఆస్వాదించే రకం కాదు. సంక్షోభాన్ని శ్వాసించే రకం. అందుకే గెలిచినప్పుడు కన్నా ఓడినప్పుడు దృఢంగా ఉంటాడు. నిలబడినప్పుడు కన్నా పడినప్పుడు బలంగా కనిపిస్తాడు. లేస్తాడు. భరోసా ఇస్తాడు. సింపుల్ గా చెప్పాలంటే బాబు కెరటం లాంటోడు. పడింది అని ఎదుటోడు సంబరపడే లోపే ఎగసి వచ్చి ముంచెత్తుతాడు. లేవడం అంటే ఏంటో చూపిస్తాడు.

కట్టేవాడే ఎప్పుడూ నానా అవస్థలూ పడతాడు. కూల్చేవాడు కులాసాగానే ఉంటాడు. ఓ నగరమో ఓ భారీ ఆలయమో కట్టడానికి తరాలు పడుతుంది. ఒకడు పోరాడుతాడు. నిలబెడతాడు. ఆ తర్వాత ఎవడో అరాచకుడు ఒక్క దండయాత్ర చేస్తాడు. నేలమట్టం అయిపోతుంది. శిధిలాలు మిగులుతాయ్. భారత దేశానికి ఇలాంటి చరిత్ర కొత్తేం కాదు. కాకపోతే కట్టినోణ్ని తరాలు తల్చుకుంటాయ్. కూల్చినోణ్ని వర్తమానమే కాదు భవిష్యత్తు కూడా శాపనార్ధాలు పెడుతూనే ఉంటుంది. ఇలాంటి శిధిలమైపోతున్న ఆశల్ని కూడా నిలబెట్టేందుకు నిబద్ధత కావాలి. అలాంటి నిబద్ధతకు నిలువుటద్దంలా చంద్రబాబు కనిపిస్తాడు జనానికి. ఆపదలో గుర్తొస్తాడు. అందుకే చంద్రబాబు పెత్తందారు కాదు. ధర్మకర్త.

కట్టడం అంటే మోజు. కూల్చడం తెలియదు. నిర్మించడం అంటే పిచ్చి. నడిపించడం అంటే ముందుంటాడు. ఎదురుదాడి తెలియదు. ఎదుటోడి కుట్రల్ని గ్రహించలేడు. టాస్క్ లో తలమునకలైపోతాడు. కాదన్నవాళ్లని కూడా కలుపుకోవాలనుకుంటాడు. వద్దన్నవాళ్లని మెప్పించేందుకు తాపత్రయపడతాడు. అమ్ముకు తినాలనే ఆలోచన చేయడు. ఆంధ్రులంటే అర్థించే వాళ్లు కాదు. అవకాశాలు సృష్టించే వాళ్లంటాడు. భవిష్యత్తును రాసే కొత్త లిపి నేర్పిస్తాడు. బతుకుల్ని చెక్కే శిల్పిలా కనిపిస్తాడు. అందుకే చంద్రబాబు పాలనలో పెరిగిన ప్రతిష్ట, అక్కరకొచ్చిన ఆస్తులే కనిపిస్తాయ్ వెనక్కి తిరిగి చూస్తే ! అందుకే చంద్రబాబు పెత్తందారు కాదు. ధర్మకర్త.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments