హీరో అంటే సినిమా మొత్తం ఉంటాడు. హీరో చుట్టూనే స్టోరీ ఉంటుంది. హీరో కోసమే సినిమా చూసే మెంటాలిటీ మనది. అలాంటిది, హీరో ఫలానా రీల్ లో కనిపిస్తాడు – ఇంటర్వెల్ ముందు ఓ ఐదు నిమిషాలు ఉంటాడు లేదంటే క్లైమాక్స్ లో పది నిమిషాలు చూడొచ్చు అంటే ఇక ఆ సినిమా ఎలా ఉంటుంది ? జిల్లాల పునర్విభజనలో కొత్తగా ఎన్టీఆర్ పేరుతో జిల్లా పుట్టుకొచ్చాక అలాగే అనిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఖండఖండాల్లో కలిపి పది కోట్లకిపైగా ఉన్న తెలుగు జాతి ఖ్యాతి పతాక లాంటి ఎన్టీఆర్ పేరును కేవలం ఓ 24 లక్షల మంది జనాభా ఉన్న ప్రాంతానికి పెట్టడం కరెక్టేనా ? మన హీరోలను మనమే చిన్నబుచ్చి, ప్రాంతాలకీ కులాలకీ పరిమితం చేస్తామనే ముద్రను ఆంధ్ర జాతి మరోసారి నిరూపించుకుందా ?
ఢిల్లీని డీ కొట్టి, కాంగ్రెస్ ను పడగొట్టి, తెలుగు జాతి తొడగొట్టేలా చేసిన మహామహుడు ఎన్టీఆర్. తెలుగు – వాడిని, వేడిని దేశానికి, ఆ మాటకొస్తే ప్రపంచానికి చాటిచెప్పిన ఘనుడు ఎన్టీఆర్. దేశాన్ని ఏలే ప్రభుత్వాన్ని తాను పెట్టిన తెలుగు దేశంతో నిర్ణయించిన చరిత్ర తారక రాముడిది. బడుగులకు గొడుగులా నిలిచి, ఆడబిడ్డలకు అండగా తలచి, పటేల్ పట్వారీలను తప్పించి పరిపాలనపై తనదైన ముద్ర వేసిన పాలకుడు. అలాంటి ఎన్టీఆర్ తెలుగు జాతి ఉన్నంత వరకూ గుండెల్లో పదిలం. సినిమా తెలిసిన ప్రతీ ఒక్కడూ, రాజకీయం అర్థం అయ్యే ప్రతీ వాడూ, జాతి సంస్కృతి ఖ్యాతి లాంటి పదాల అర్థాలను ఆకళింపు చేసుకునే ఆలోచన ఉండే ప్రతీ తెలుగువాడూ ఎన్టీఆర్ ఆలోచల్ని సందర్శిస్తాడు. స్మరిస్తాడు. కీర్తిస్తాడు. అలాంటి ఎన్టీఆర్ కి ప్రాంతంతో పనేముంది ? మన ప్రాణాలు నిలిపే గాలిని ప్రత్యేకంగా పట్టి చూపించాల్సిన అవసరం ఉందా ? మనకి వెలుగులు ప్రసాదించి బతుకు ఇస్తున్న సూర్యుడికి వరమాల వేసి సత్కరించాల్సిన పని ఉందా ? అలాగే, ఎన్టీఆర్ పేరును ఇప్పుడు ఓ జిల్లాకు పెట్టి ప్రత్యేకంగా గౌరవిస్తున్నామని చెప్పుకోవడం దేనికి ? రాజకీయ సింపథీ కొట్టేయడానికి తప్ప !
ఎన్టీఆర్ పుట్టిన నిమ్మకూరు పామర్రులో ఉంటుంది. ఆ ప్రాంతం క్రిష్ణా అని చెబుతున్న జిల్లాలో ఉంది. భౌగోళికంగా తూర్పు ప్రాంతం. సముద్రం వైపు. కానీ ఎన్టీఆర్ పేరుతో వెలుస్తున్న కొత్త జిల్లాకు కేంద్రం విజయవాడ. అంటే పశ్చిమ ప్రాంతం. ఇందులో ఎన్టీఆర్ పుట్టిన ప్రాంతం లేదు. కానీ ఈ ప్రాంతానికి ఎన్టీఆర్ జిల్లా అనే పేరు పెట్టాలన్నది ప్రతిపాదన. ఇదెక్కడి మహత్తర ఆలోచనో అర్థం కాదు. ఎన్టీఆర్ పేరు పెట్టుకోవడానికి విజయవాడ జిల్లావాసులకి పెద్ద అభ్యంతరం ఉండకపోవచ్చు. ఇక్కడ పాయింటు అది కాదు. అసలు ఎన్టీఆర్ లాంటి నాయకుల, మహావ్యక్తుల పేర్లు ప్రాంతాలకి పెట్టడం కరెక్టేనా – అనేది పాయింటు. ఇలా పెట్టుకుంటూ పోతే జాతిని ప్రభావితం చేసి, తీర్చిదిద్దిన మహోన్నతులు కూడా ఓ ప్రాంతానికి పేరుగా మిలిగిపోతారు. అందుకే ఇలాంటి ఆలోచనల్ని పశ్చిమ దేశాలు ప్రోత్సహించవు. అంగీకరించవు. ఫలానా స్ట్రీట్ కి ఆయన గౌరవార్థం పేరు పెట్టాము అంటాయి తప్పితే ఫలానా రాష్ట్రానికో జిల్లాకో పెట్టాము అని చెప్పవు చూడండి. ఎందుకంటే ఓ వీధికి పేరు పెట్టడం అంటే ఆ నాయకుణ్ని స్మరించడం మాత్రమే. అదే ప్రాంతానికి పేరు పెట్టడం అంటే పరిమితం చేయడం. అందుకే మహాత్మాగాంధీ స్ట్రీట్ ఉంటుంది కానీ మహాత్మా గాంధీ స్టేట్ ఉండదు మనకి కూడా ! వాషింగ్టన్, గాంధీ నగర్ లాంటివి కొన్ని ప్రత్యేక మినహాయింపులు. కానీ ఆంధ్రుల దౌర్భాగ్యం మరో రకంగా ఉంది.
కులం పేరుతో రాజకీయం చేయడం, ప్రాంతం పేరుతో రెచ్చగొట్టడం, వ్యక్తుల పేరుతో విద్వేషం పెంచడం మనకి వెన్నెతో పెట్టిన విద్య. తన రాజకీయ, సినిమా జీవితంలో ప్రాంతాలకి అతీతమైన, కులానికి అందని అఖండ కీర్తి ప్రతిష్టలు సాధించిన ఎన్టీఆర్ కూడా ఇప్పుడు ఇలాంటి ప్రాంతీయ కత్తెరలో ఇరుక్కోవడమే అసలు విషాదం. ఇలాంటి ఏర్పాటును, ఎన్టీఆర్ కి కులం పేరుతోనో పార్టీ పేరుతోనో మద్దతు పలికేవారు కాదనరు. చప్పట్లు కొడతారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీకి ప్రత్యర్థులుగా ఉన్న వాళ్లు కూడా స్వాగతిస్తారు. ఎందుకంటే ప్రత్యర్థికి గౌరవం ఇచ్చాం అనే ఇమేజ్ కోసం. ఈ పోటాపోటీలో అసలు మరుగున పడే వాస్తవం – స్థాయి. అవును. స్థాయిని తగ్గిస్తున్నామా ? మహామహులకి ప్రాంతీయ ముద్ర కొడుతున్నామా ? అనే ఆలోచన మనలో ఎవరూ చేయకపోవడమే ఇక్కడ అసలు సంక్షోభం. అయినా పేర్లు పెడితేనే గౌరవించినట్టు అయితేనో, ప్రత్యర్థి పార్టీ నాయకుల పేర్లను పథకాలకు వాడి ఏదో ఎత్తుగడ వేసేశాం అనుకుంటేనో పొరపాటు. రాజకీయాల్లో అలాంటివి పెద్దగా నిలబడవు. ఒక వేళ అలాంటి ఎత్తుగడలు కలిసొచ్చే పరిస్థితే ఉంటే కాంగ్రెస్ కనీసం కడపలో అయినా నాలుగు ఓట్లు తెచ్చుకునేదేమో 2014లో ! అలా జరగలేదూ అంటే ఇలాంటి ప్రయత్నాలు వృధా ప్రయాస. మిగిలేది బూడిద.
ఇలాంటి నిర్ణయాలు ఎవరి విషయంలో చేసినా, ఏ పార్టీ చేసినా తప్పే అవుతుంది. చరిత్ర చూస్తే తెలిసే నిజం ఇది. వైఎస్ విషయంలో కూడా జరిగింది ఇదే. 23 జిల్లాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఓ వెలుగు వెలిగిన స్థాయి వైఎస్ ది. అదిలాబాద్ లో వైఎస్ ఎంత పాపులరో శ్రీకాకుళంలో కూడా అంతే ఫేమస్. పాలమూరు ప్రాంతం కూడా ఇప్పటికీ వైఎస్ ను తలుచుకుంటుంది. అలాంటి వైఎస్ పేరును ఓ జిల్లాకు, కడపకు పెట్టడం వల్ల ఓ పాతికేళ్ల తర్వాత పరిస్థితి మరోలా కనిపిస్తుంది. అప్పటికి వైఎస్ ను నేరుగా చూసిన జనరేషన్ పెద్దగా ఉండదు. కొత్త తరానికి వైఎస్ అనగానే కడప నేతగా తెలుస్తారు. అంటే పరిధిని పెంచినట్టా ? తుంచినట్టా ? స్థాయిని తగ్గించినట్టా ? హెచ్చించినట్టా ? ప్రాంతాలకి పేర్లు పెట్టడం వల్ల వచ్చే పెనువిపత్తు ప్రాంతీయ ముద్ర. ఇంత లోతుగా – దీర్ఘకాలికంగా – మేథోపరంగా ఆలోచించే స్థాయి, స్థోమత మనకి లేవు. అప్పట్లో కాంగ్రెస్ ఉంది. వైఎస్ కి గౌరవం ఇచ్చాం అని చెప్పుకొని రాజకీయ లబ్ది పొందాలి అనుకొని పేరు పెట్టింది. ఇప్పుడు జగన్ ఉన్నారు. పాదయాత్రలో హామీ ఇచ్చా కాబట్టి ఎన్టీఆర్ పేరు పెట్టాను అంటారు. అప్పడు కాంగ్రెస్ కి కానీ ఇప్పుడు జగన్ కి కానీ వచ్చిన నష్టం లేదు. కష్టం అంతా భావి తరాల దృష్టిలో ఆ మహామహుల స్థాయిని తగ్గించినట్టు అవుతోందన్న ఆలోచనతోనే !
మన భావదారిద్ర్యానికి ఇదో ప్రతీక. రాజకీయాల కోసం మనం ఎంతకైనా దిగజారతాం, ఎవరినైనా దిగజారుస్తాం అనేందుకు ఇదో నమూనా. ఇంత జరుగుతున్నా కనీసం ఆలోచన మాత్రంగా అయినా వ్యక్తం చేయలేని చేతగాని చేవలేని స్థితిలో ఉన్న మన జాతిని మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఆంధ్రుల చేతిలో కోహీనూర్ ఉన్నా – పూట గడవడం కోసం దాన్ని తాకట్టు పెట్టే రకం వాళ్లు. స్వల్పకాలిక ఆనందం కోసం దీర్ఘకాలిక దు:ఖాలను కౌగిలించుకోవడం వాళ్లకి అలవాటు. వాళ్ల తెలివి అంతే – అని మొన్న ఎన్నికల ఫలితాల తర్వాత ఢిల్లీలో ఓ అగ్రగణ్యుడు చేసిన వ్యాఖ్య ఇప్పుడు గుర్తొస్తోంది. నిజమనిపిస్తోంది. అన్నగారూ క్షమించండి !