33 C
Vijayawada
Friday, April 12, 2024
Homeనీతి ప్రత్యేకంఅమరావతి సభ అఖండ విజయానికి కారణం ఏంటి ?

అమరావతి సభ అఖండ విజయానికి కారణం ఏంటి ?

మన మాటలకి మన ఇంట్లో వాళ్లు పొంగిపోతే అది సంతోషం. అదే మన మాటలకి ఊరంతా చప్పట్లు కొట్టి వెంట నిలిస్తే సంబరం. ఊరు కాదు జిల్లా కాదు మరో ప్రాంతమే మనకి తోడై నిలిచి జై కొడితే – అది ఉరిమే ఉత్సాహం. ఉవ్వెత్తున ఎగసే ఉత్సవం. బ్రహ్మాండ నాయకుని పాదాల చెంత జరిగిన అమరావతి బ్రహ్మోత్సవం. అక్షరాలా తిరుపతి సభతో అమరావతి సాధించిన సపోర్టు ఇదే. అమరావతిని సీమ గుండెల్లో పెట్టుకుంది. ఆప్యాయంగా హత్తుకుంది. మాతోనే ఉంటానని పలికి, మా ఊరొచ్చి ఇల్లు కట్టి నమ్మించి దెబ్బ తీశావ్. నీ నమ్మక ద్రోహాన్ని నీ ప్రాంతం సాక్షిగా నిలదీస్తాం చూడు – అని అమరావతి రైతులేమీ శపథాలు చేయలేదు. సవాళ్లు విసరలేదు. రాష్ట్రం కోసం, రాజధాని కోసం, భవిష్యత్ కోసం, రేపటి తరాల కోసం పాదయాత్ర చేస్తున్నాం – అంటే పూలబాట పరిచి స్వాగతించిన సీమ… తిరుపతి సాక్షిగా అమరావతి కోసం గొంతెత్తి అరిచింది. ఇది యుద్ధానికి ముందు శంఖారావం. తిరుపతితో కలిసి అమరావతి చేసిన శంఖారావం.

 

ముక్కు పుడక కొనలేని మొగుడు వచ్చే ఏడాది వడ్ఢాణం చేయిస్తానని వాగ్దానం చేశాట్ట. ప్రాంతంతో సంబంధం లేదు. రాష్ట్రం అంతా మొత్తుకుంటోంది ఇలాంటి వాటం చూసే. చేతిలో చిల్లి గవ్వ లేదని, ఖజానాలో తొంగి చూస్తే చిల్లులు తప్ప ఏం కనపడ్డం లేదని తేలిపోయింది. ఇక బతుకు తెగిన గాలిపటం అయిపోయిందని అర్థం అయిపోతోంది. అందుకే తొలి పోరాటానికి మలి విడత మద్దతు పెరుగుతోంది. అవును. ఆంధ్రప్రదేశ్ రాత తిరగబడిన తర్వాత తలెత్తిన తొలి పోరాటం అమరావతి ఉద్యమం. రాజధాని లేకుండా చేస్తారా, రాష్ట్ర భవిష్యత్ సంగతేంటి, మాకిచ్చిన మాటేమిటి – అంటూ యుద్ధానికి దిగాడు అమరావతి రైతు. తొలి అడుగులో ఒంటరి. అయినా బెరుకు లేదు. రోజులు గడుస్తున్న కొద్దీ బాధితులు పెరిగి గుప్పెడు మంది పోరాటం ఉప్పెనలా మారింది. ఆ ఒక్కడి తీరుతో దెబ్బ తిన్న ప్రతి ఒక్కడూ రంగంలోకి దిగినా చాలు అమరావతి సైన్యం ఐదు కోట్లపైనే అన్నట్టు కనిపించింది తిరుపతిలో ఉత్సాహం చూశాక.

తాయిలాలు పంచి కొన్నాళ్లు నడపొచ్చు. కేసులు కట్టి, కవ్వింపులు చేసి ఇంకొన్నాళ్లు నెట్టుకురావొచ్చు. ప్రాంతాల పేరుతో రెచ్చగొడితే మరికొన్నాళ్లు లాగొచ్చు. రెండున్నరేళ్లలో అబద్ధాలకి నూరేళ్లు నిండాయ్. ఇక పేటీఎం ప్రచారాలు విఫలం అవుతున్నాయ్. భవిష్యత్ చీకట్లు కళ్ల ముందు కనిపిస్తున్నాయ్. ఇలాంటి సమయంలో అమరావతి పోరాటం ఓ టార్చ్ బేరర్ అవుతోంది. కాగడా పట్టి చీకట్లను చీల్చుకుంటూ నడుస్తోంది. భవిష్యత్ వైపు రావాలి అనుకునేవాళ్లు మా వెంట నడిచి తీరాలి, పోరాటానికి దిగాలి అని ఆ కాగడా వెలుగు రాష్ట్రానికి వెలుగు రేఖ చూపుతోంది. తిరుపతి వేదికగా రుజువు అయిన వాస్తవం ఇది. అందుకే అన్ని పార్టీలూ అక్కడికి వచ్చి వాలాయ్. అమరావతికి మేం తోడుగా ఉన్నాం అని ప్రకటించుకున్నాయ్. నిజానికి అమరావతికి పార్టీలు అండ కాదు. పార్టీలకి అమరావతే అండ. ఎందుకంటే, జనం ఎటు వైపు ఉంటే పార్టీలు అటు వైపు తిరిగి చూడాల్సిందే. నడవాల్సిందే. అమరావతి తోడు లేకపోతే మనుగడ లేదు మునుగుడే అని పార్టీలు గ్రహించాయ్ కాబట్టే తిరుపతి సభకొచ్చి పరపతి నిలబెట్టుకున్నాయ్.

ఇక టీడీపీ గురించి కచ్చితంగా ఇక్కడ చెప్పాల్సిందే. చేసింది చెప్పుకోలేని, సమర్థంగా జనానికి అర్థమయ్యేలా చెప్పలేని శాపం ఏదో చంద్రబాబుకి ఉంది. తిరుపతిలో కూడా అంతే. మెత్తమెత్తగా ఏదో అంటున్నాడు. వికేంద్రీకరణ అంటే అభివృద్ది అని. అయ్యా సామీ అవతలోడు కబడ్డీ పేరుతో కాళ్ల మధ్య తంతానంటున్నాడు. తన్నాడు. ఇంకా నీళ్లు నములుడెండుకు సూటిగా చెప్పెయ్. వికేంద్రీకరణ అంటే మూడు రాజధానులా ? అదెలా ? రాజధాని పెడితేనే అభివృద్ధి సాద్యం అంటే మూడు కాదు పదమూడు పెట్టాలి రాజధానులు. జిల్లాకొకటి చొప్పున. సాధ్యమా ? ఈ విషయం తేల్చండి ముందు. లేదూ, రాజధాని పెడితేనే అభివృద్ధి అవుతుంది అంటారా, అమరావతి పెట్టాక ఎవడో వచ్చి చెడగొట్టుడు తప్ప ఏం జరిగింది ? రాజధాని అమరావతి అన్నావ్ కానీ కియా ఎక్కడ పెట్టావ్ చంద్రబాబూ ? ప్రపంచంలోనే అతి పెద్ద సోలాల్ పార్క్ ఎక్కడ కట్టడం మొదలు పెట్టావ్ ? మొబైల్ హబ్ ఆప్ ఇండియా అనే రేంజులో క్లస్టర్ ఏ జిల్లాలో ఉంది ? ఇవన్నీ అమరావతి ఎగువన దిగువన పక్కనా పెట్టావా ? లేదే ! సాఫ్టువేర్ కంపెనీలు, బ్లాక్ చెయిన్ హబ్ విశాఖకు ఇచ్చా, ఇస్తా, ఇస్తున్నా అని చూపించావ్ … అది అమరావతిలో భాగమా ? ఇది కాదూ వికేంద్రీకరణ అంటే ! ఇలా ఎందుకు చెప్పవ్ ? చేసెప్పుడు ఉన్న చేవ… చెప్పేటప్పుడు మాత్రం ఎందుకు ఉండదు బాబూ !

నిజం నీరసంగా నీలిగితే అబద్ధం ఆలోపే ప్రపంచాన్ని చుట్టేస్తది. అవతల నీలి నికృష్టం చూశాక అయినా ఈ సంగతి తెలుసుకోపోతే ఎట్లా ? చంద్రబాబు ఎలాగూ చెప్పడం లేదు ఇలాంటి విషయాలు. అమరావతి రైతులే దూతలుగా మారి చెబుతున్నారు ఆంధ్ర దేశం మొత్తానికీ. అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ కి ముందరుండి నడిపించే సైన్యం అని నిరూపించారు. అమరావతి అ – తో మొదలైతే ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాత ఆతో వస్తుందని మాత్రమే కాదు పోరాటంలో కూడా రాష్ట్రం కోసం ముందే కళ్లు తెరిచిన పోరాట గడ్డ అమరావతి. ఎదుటోడు బలం మీద ఉన్నప్పుడే, వాడి బలగం విరుచుకుపడుతున్నప్పుడే యుద్ధం ప్రకటించిన సైనికుడు అమరావతి రైతు. ఇవాళా రేపూ అంటే అవతలోడు వీక్ ఫెలో అని అందరికీ తెలిసిపోయింది కాబట్టి ఊపు రావడం సహజమే. కానీ రెండేళ్లనాడు అలా లేదు. సీమ గుండె ధైర్యం మాలో ఉంది, ఉత్తరాంధ్ర స్వచ్ఛత మా డిమాండ్ లో ఉంది, గోదావరిలో మంచిదనం, క్రిష్ణా కరుకుదనం, ప్రకాశం దూకుడు అన్నీ కలగలిపిన పోరాటం ఇది అని అమరావతి ఆనాడే చూపించింది. అందుకే ఇప్పుడు తిరపతి నడిబొడ్డున సీమ సాక్షిగా సింహగర్జన చేసింది అమరావతి. ఈ సభకి ఇంజిను రైతులైతే నడిపించే చక్రాలు, దారి చూపే స్టీరింగు, ఎదుటోడి చెవుల్లో మార్మోగిన సైరన్ లాంటి హారనూ అన్నీ సీమ జనమే ! అందుకే అంటున్నది తిరుపతి ఇప్పుడు అమరావతిని తోబుట్టువులా ఆదరించింది. అక్కున చేర్చుకుంది. నేనున్నా అంటూ అన్నలా అండగా నిలబడింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments