26 C
Vijayawada
Wednesday, April 24, 2024
Homeరాజ నీతిఏపీలో కొత్త పార్టీ వెనక ఉన్నదెవరు ?

ఏపీలో కొత్త పార్టీ వెనక ఉన్నదెవరు ?

మాయాబజార్ లో ఘటోత్కచుడు చెప్పినట్టు, ఎవరూ పుట్టించకపోతే పార్టీలు మాత్రం ఎలా పుడతాయ్ ? కచ్చితంగా ఎవరో ఒకరు ఉండి తీరుతారు. ఇది మాస్కుల సీజన్ కదా, ముందు మాస్క్ కనిపిస్తది. కాస్త తప్పించి చూస్తే వెనక ఫేస్ కనిపిస్తది. ఓ కులం పేరుతో పుడుతుంది పార్టీ అని, ముఖ్యంగా అప్పొజిషన్ లోని మూడు పార్టీల నుంచి తలో కాస్త గుడ్డ చించి కొత్త చొక్కా కుడతారు అని అంటుంటే ఆసక్తి పెరుగుతోంది. ఇంతకీ చిరిగేదెవరికి ? కుట్టేదెవరు ? బతికి బట్టకట్టేదెవరు ?

కొత్త పార్టీల దెబ్బ ఎలా ఉంటుందో తెలియాలంటే 12 ఏళ్లు వెనక్కి వెళ్లాలి. మన్మోహన్ ఇమేజ్ తో కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 33 ఎంపీ స్థానాలు గెలిస్తే అసెంబ్లీకి వచ్చేసరికి మాత్రం బొటాబొటీగా 156 సీట్లు మాత్రమే గెలిచింది. నిజానికి ఎంపీ సీట్ల ఫలితాన్ని బట్టీ చూస్తే కాంగ్రెస్ 230 సీట్లు సాధించి ఉండాలి. కానీ అలా జరగలేదు అంటే కారణం నాటి రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత. అంత ప్రతికూలంగా ఉన్నా మరి ఎలా బతికి బయటపడింది కాంగ్రెస్ ? కారణం ఆ ఎన్నికల్లో కొత్తగా పుట్టిన ప్రజారాజ్యం. 288 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ 18 శాతం ఓట్లు సాధించింది. దాదాపు 10 పర్సెంటు టీడీపీ ఓట్లను చీల్చింది. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును పీఆర్పీ పంచుకునేసరికి కాంగ్రెస్ బతికిపోయింది. సరిగ్గా ఇప్పుడు ఇదే మోడల్ ను ఏపీలో మరో సారి రిపీట్ చేయాలన్న ఎత్తుగడ వేస్తున్నట్టు చర్చ సాగుతోంది గట్టిగా !

కులాల పేర చిచ్చు పెడితే ఏపీలో బాగా మంటలు అంటుకుంటాయన్నది ప్రశాంత్ కిషోర్ నిరూపించిన సిద్ధాంతం. అంతా కమ్మ మయం అని చంద్రబాబు మీద ప్రచారం చేసి, బదిలీలు, ఉద్యోగాలు, పెత్తనం అంతా ఆ కులం కోసమే సాగుతున్నాయని నమ్మించిన ప్రభావం 2019 ఎన్నికల్లో బాగానే పని చేసింది. ఇప్పుడు అలాంటి అస్త్రాన్ని ఇంకో సారి వాడే అవకాశం లేదు. అధికారంలో లేని పార్టీ మీద పాత ఎత్తుగడలు కొత్తగా పని చేయవు. అందుకే కాపుల కోణంలో వ్యూహం సిద్ధం అయ్యిందని చెబుతున్నారు. ఈ స్ట్రాటజీకి రెండు వైపులా పదును ఉందీ అనేది కొందరి నమ్మకం. అంటే, కాపుల్ని ఏకం చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశం ఉందన్న ఆశ ఒకటి. రెండోది జనసేనకి పడాల్సిన ఓట్లను చీల్చితే పవన్ కి రెండోసారి ఎదురు దెబ్బ కొట్టొచ్చు అనేది. అందుకే కాపు ఉద్యమ నాయకుడిగా ముద్ర ఉన్న నాయకుణ్ని ముందు పెట్టి గడ గడలాడిస్తామని భావిస్తున్నారు. టీడీపీకి దూరం జరిగి, వైసీపీకి దగ్గరగా ఉన్న విశాఖ ఎమ్మెల్యే చురుగ్గా ఉన్నారు ఈ మిషన్ లో అని అంటున్నారు. ఎన్నిక ఎన్నికకూ పార్టీ మారడం ఆయనకి అలవాటు. ఈ సారి కొత్త పార్టీ పెట్టి కథ నడిపేందుకు ఆయన్ని వాడుతున్నారని, అందుకే నేరుగా పార్టీలోకి తీసుకోలేదని కన్ఫామ్డ్ గా వినపడుతోంది.

ఇక పోలీసు అధికారిగా ఎంతో ప్రచారం, ప్రాచుర్యం పొందిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ పేరు కూడా వినపడుతోంది. సిద్ధాంతాలకు కట్టుబడే వ్యక్తిగా లక్ష్మీ నారాయణపై నమ్మిక ఉంది. రైతు సమస్యల విషయంలో నాకు ఓ విజన్ ఉందీ అంటూ గత ఎన్నికల ముందు ఆయన మాట్లాడినప్పుడు బాగానే ఆలకించారు కొందరు. అలాంటి ఆయన ఇప్పుడు కులం పేరున నడుస్తుంది అని చెబుతున్న పార్టీ తరపున ఓట్లు అడుగుతారా అనేది అనుమానమే ! ఒకవేళ అడిగితే ఆశ్చర్యమే ! ఇక కొత్తగా ఓ టీవీ ఛానెల్ వస్తుందని, ఆల్రెడీ ఉన్న ఛానెళ్లలో ఒకటి ఈ పార్టీకి మద్దతు పలుకుతుందని కూడా మీడియా వర్గాల్లో చర్చ. అంటే మందుగుండు సామాగ్రి గట్టిగానే కూర్చుతున్నట్టు కనిపిస్తోంది. మరి శబ్దం ఏ స్థాయిలో వస్తుందో చూడాలి. ఎందుకంటే ఇది 2009 కాదు. ఎన్నికల సంవత్సరం 2024, మరీ తోసుకొస్తే 23.

కొద్దో గొప్పో పాజిటివిటీ ఉన్నప్పుడు కులం ఫ్యాక్టర్ పని చేసే అవకాశం ఉంటుంది. జనానికి ఏ ఇష్యూ లేనప్పుడు ఓ అజెండా అయ్యే శక్తి కులానికి ఉంటుంది. కానీ జనంలో ఆక్రోశం, జీవితంలో భయం, భవిష్యత్ ఏంటో తెలియని అయోమయం ఉన్నప్పుడు కులం చూసుకోరు. బతుకు కోరుకుంటారు. ఇక, కాపు సామాజిక వర్గం నుంచి వచ్చినా పవన్ ఎప్పుడూ కులం పేరుతో ఓట్లు అడిగినట్టు కనిపించలేదు. బీసీలూ, కాపు, బలిజ, ఒంటరి లాంటి కులాలన్నీ కలిసి పోరాడితే ఎందుకు సత్తా చాటలేం – అంటూ ఆవేశంగా మాట్లాడుతున్నప్పుడు ఓ ఆల్టర్ నేటివ్ థాట్ కనిపిస్తుంది ఆ మాటల్లో ! అలాంటి పవన్ కల్యాణ్ పార్టీని దెబ్బ తీసేందుకు కూడా ఈ ఎత్తుగడ వేస్తున్నారు అనే సంకేతం ఆయా వర్గాలు అర్థం చేసుకుంటే సరిపోతుందేమో బహుశా ! సంక్రాంతి సమయంలో ఇళ్ల ముందుకు వచ్చే గంగిరెద్దుల్ని చూస్తే ముచ్చటేస్తుంది. అదే ఎన్నికల ముందు ముసుగులేసుకొని, ఓటు కోసం ఇళ్ల ముందుకు వస్తే ఎలా స్పందించాలో ఏపీ తేల్చుకోవాలేమో !

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments