30 C
Vijayawada
Friday, April 19, 2024
Homeనీతి ప్రత్యేకందిగిపోయే ముందు ఇంకెంత దిగజారాల్సి ఉంటుందో అన్నా ?

దిగిపోయే ముందు ఇంకెంత దిగజారాల్సి ఉంటుందో అన్నా ?

కోహ్లీని కుర్చీలోంచి దింపేసిన తీరు డైజెస్ట్ కావడం లేదని చాలా మంది ఇనో వాడుతున్నారు. విజయాల కెప్టెన్ ను ఇలాగే సాగనంపుతారా అని కొందరు, అసలు మర్యాద తెలుసా అని మరికొందరు రగిలిపోతున్నారు మన దగ్గర. వీళ్లందరికీ తెలియని విషయం ఒకటుంది. ఎంతోటి వాడైనా వీడ్కోలుకి లోకువ. దిగిపోయే టైమ్ వచ్చినప్పుడు దిగ్గజాలు కూడా దినదినగండంగా బతికినవాళ్లే ! అలాంటిది అప్పనంగా కుర్చీ ఎక్కి, కుర్చీ కంటే నేనే పవర్ ఫుల్ అని అనుకొని ఇష్టానుసారం రెచ్చిపోయేవాళ్లు దిగిపోయే సమయం ఇంకెంత దిగదుడుపుగా ఉంటుంది అనేదే అసలు పాయింట్ !

కుర్చీలో ఉన్నాను కదా అని ఇష్టానుసారం టీమ్ ను డిసైడ్ చేసినప్పుడు ఎవ్వడూ మాట్లాడలేదు. ముగ్గురు వికెట్ కీపర్లతో బ్యాకప్ బ్యాట్స్ మెన్ లేకుండా వరల్డ్ కప్ కి వెళ్లినప్పుడు ప్రశ్నించినోడు లేడు. ఆఖరికి అనిల్ కుంబ్లే లాంటి దిగ్గజాన్ని, దడవ విరిగినా దేశం కోసం పోరాడిన యోధుణ్ని అన్ సెరిమోనియస్ గా పంపేసినప్పుడు, అధికారం లేకపోయినా ఓ కెప్టెన్ కోచ్ ని డిసైడ్ చేసినప్పుడు కూడా ఎవ్వడూ మాట్లాడలేదు. అవన్నీ సమ్మగా అనిపించాయ్ మనకి ! ఎందుకంటే మనకి వ్యక్తి ఆరాధన అంటే మోజు. వ్యవస్థ కాదు మనకి వాడే ముఖ్యం. బానిస భావజాలం. పర్సన్ గురించి మాత్రమే మాట్లాడతాం. సిస్టమ్ గురించి చెప్పం. మనం బానిసలం. ఇక కుర్చీలో ఉంటే పవర్ మొత్తం నా దగ్గరే ఉందని రెచ్చిపోతే, ప్రతీవాడితోనూ పంచాయతీ పెట్టుకుంటే, మూడే రోజు ఇలాగే ముదనష్టంగా ఉంటుంది. మనసుకి కష్టంగా అనిపిస్తది. ఇది స్వయంకృతం. రోహిత్ నో గంగూలీనో నిందించి లాభం లేదు. నో వన్ ఈజ్ రాంగ్. దిస్ ఈజ్ జస్ట్ బూమరాంగ్.

అప్పటికీ కోహ్లీకి బీసీసీఐ ఓ అవకాశం ఇచ్చింది. టీ20 కెప్టెన్ గా తప్పుకుంటా అంటే వద్దని చెప్పాం అని కవర్ చేసింది. పైపెచ్చు, అశ్విన్ ను దుబాయ్ వరల్డ్ కప్ కి తీసుకోవాలని పట్టుపట్టింది కోహ్లీనే అని క్రెడిట్ ఇచ్చింది. అదే అశ్విన్ ను ఆరేళ్లుగా వైట్ బాల్ వేయనివ్వకుండా అడ్డుకున్నదే కోహ్లీ. అలాంటిది, కవర్ చేసి క్లవర్ అని చెప్పినందుకు సంతోషించాల్సింది పోయి కాలుదువ్వడం అంటే – పాపం బ్రాండ్ వేల్యూ నేలనాకి పోతుందని సఫకేట్ అవుతున్నాడు అని అర్థం అయ్యింది. కోహ్లీనే కాదు మన కళ్లు ముందట – అధికారాన్ని, కుర్చీను అనుభవిస్తూ రెచ్చిపోతున్న వాళ్ల వీడ్కోలు ఇలాగే విషమంగానే ఉంటుంది. అదంత సులభం కాదు. కాస్తో కూస్తో కోహ్లీనే నయం. బ్యాటింగ్ సామర్థ్యంతో కుర్చీ సాధించుకున్నాడు. సాధించాక, కాలం కలిసొచ్చినప్పుడు రెచ్చిపోయాడు అది వేరే విషయం. ఇంకొందరు ఉంటారు. ఎవరి సాయమో తీసుకొని, వ్యవస్థల లొసుగుల్ని అడ్డుపెట్టుకొని కుర్చీ సాధిస్తారు. సాధించాక ఆ కుర్చీ కంటే నేనే గొప్పా అన్నట్టు చెలరేగిపోతారు. చేతిలో పైసా లేని పరిస్థితుల్లోకి జారిపోతారు. అలాంటప్పుడు దిగిపోయే సమయం దగ్గర పడుతున్న కొద్దీ గుండెల్లో ఫైరింజన్ గంటలు మోగుతాయ్. ఆ మంటలు ఆర్పడం ఎవ్వడి తరమూ కాదు. అంతా సవ్యంగా సాగిపోతున్నప్పుడు, అధికారమో కుర్చీనో మన సీటు కింద ఉన్నప్పుడు అంతా మనదే అనే మూర్ఖత్వం కళ్లు మూసేస్తుంది. కానీ వాస్తవం వేరు. నువ్ తోపు అనే వాడే నిన్న వదిలిపోవడానికి ఎంతో సమయం పట్టదు.

తెలతెలవారగానే సూర్యోదయం. ఉల్లాసం ఉత్సాహం ఉదయభానుడి కిరణాలు, విటమిన్ డి అంటూ ఎవరి కోణంలో వాళ్లు వెచ్చదనాన్ని ఆస్వాదిస్తారు. కాస్త సమయం అయ్యాక హీటు మామూలుగా లేదు. చండప్రచండం అనేస్తారు. మధ్యాహ్నం తర్వాత నడినెత్తికి వస్తాడు. అది ఇక పీక్స్. మిట్టమధ్యాహ్నం. పతాకస్థాయి. అటు నుంచి ఇక దిగడం మొదలవుతుంది. సాయంత్రం అవుతున్నకొద్దీ ఇక వీడు ఎప్పుడు పోతాడో అని… చెట్టు పుట్టు పిట్టా అన్నీ సర్దుకుంటాయ్. అస్తమయం తర్వాత ఇక వాడి మాటే ఉండదు. ఇదే వీడ్కోలు అంటే. ఇదే ప్రకృతి. ఇది సృష్టి నియమం. ఇంతోటి ప్రకృతిలో పిపీలకాల్లాంటి పీలికలం మనం. ఈ లెక్కన మనం చూస్తున్నవాళ్లలో కొంత మంది నిష్క్రమణ ఇంకెంత కటువుగా ఉంటుందో !

అధికారానికి అయినా, ఆటగాడికి అయినా, ఉద్యోగికైనా ఇంకెవరికైనా వీడ్కోలు అనేది జడ్జిమెంట్ టైమ్. నువ్ ఏం చేశావనేది నీ కళ్ల ముందు కనిపించే కాలం అది. అధికారాన్ని నువ్ చెలాయించి, నడిపించావ్ కాబట్టే ఆ అధికారం నిన్ను వదిలించుకుంది. కెప్టెన్ కి బోర్డ్ ఇచ్చిన సందేశం ఇది. అదే నువ్ ఎప్పుడు వెళ్లిపోతావా అని జనం ఎదురు చూస్తున్నారూ అంటే నీకిచ్చిన పవర్ కి నువ్ సూట్ కాలేదని అర్థం. అవును. దిగిపోయే ముందు ఎదుర్కొనే పరిస్థితులే గౌరవానికి గీటురాళ్లు. ఎంత సమర్థంగా ఎదుర్కొన్నాం, ఎంత కేపబులిటీతో నడిపించాం, ఎంత ఆనందంతో మన చుట్టూ ఉన్న కళ్లు మనల్ని చూశాయ్ అనేదే పాయింటు. నిరంతరం అభద్రతలో, ఫస్టు తారీఖు పేరెత్తగానే ఠారెత్తిపోయే పరిస్థితులు ఉన్నాయంటే మనం కుర్చీకి అనర్హులం అని అర్థం. అమసర్థుడు ఎప్పుడూ కుర్చీకి పరువు కాదు. బరువు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments