అయోధ్య వివాదాన్ని పరిష్కరించి అద్భుతమైన భవ్య దివ్య ఆలయాన్ని నిర్మిస్తున్నామని చెప్పే బీజేపీ ఉన్నట్టుండి కాశీ వైపు మళ్లింది ఎందుకు ? రాముడిని తలచుకోవడం తగ్గించి, కాశీ విశ్వనాథుణ్ని ఎందుకు పదే పదే స్తుతిస్తోంది ? మోడీ మూడు రోజులు మకాం వేసి, అర్థరాత్రులు కూడా కెమెరాలకు విశ్రాంతి ఇవ్వకుండా, అభివృద్ధి పనులు దగ్గరుండి ఎందుకు చూసుకున్నట్టు ? రథయాత్ర కాలం నాటి ఎత్తుగడలు చెల్లవని, కొత్త తరంగం ఉత్తుంగమై ఎగసి పడుతోందని బీజేపీ ఇప్పటికే గ్రహించింది ! ఒక్క యువ నాయకుడు – వర్గాల్నీ, వర్ణాల్నీ, ఉప ప్రాంతీయ శక్తుల్నీ కూడగట్టి మోగించిన యుద్ధభేరీ, బీజేపీ నేతల చెవుల్లో ఖంగున మోగుతోంది. ఏంటి రాజకీయం మారుతోందా ? యూపీలో డౌన్ ఫాల్ మొదలైతే ఢిల్లీలో లెక్క మారినట్టే ! యూపీ ఫలితంతో ఏపీకి కూడా లింకుంటుంది. అక్కడ ఏం జరుగుతుంది, ఎన్ని వస్తాయ్ అనేదాన్ని బట్టీ బీజేపీ గేమ్ కొలిక్కి వస్తుంది ఇక్కడ. ఇంతకీ అతనొక్కడే అనడానికి కారణం ఏంటి ? ఏం చేస్తున్నాడు ?
క్రీజులో నిలబడే తీరును బట్టే తెలిసిపోతుంది ఎంత సేపు ఆడగలడు, ఎలా ఆడతాడు, టెక్నిక్ లో డెప్త్ ఎంత అని ! బౌలర్ చేతిలోంచి బంతి వదిలిన తర్వాత లాఘవంగా వికెట్లు కవర్ చేసుకుంటూ బౌన్స్ చూసి బేలన్స్ తో ఆడేవాళ్లు అక్కడక్కడా కనిపిస్తారు. మొనగాళ్లు అనిపిస్తారు. ఇలాంటి వాళ్ల వికెట్ అంత తేలిగ్గా దొరకదు. ఇప్పుడు అతను కూడా అలాగే కనిపిస్తున్నాడు. ఎనిమిదేళ్లుగా సాగుతున్న మోడీ జైత్రయాత్రకు బ్రేకులు వేసేది అతడే అనే చర్చ ఉత్తరాదిలో ఊపందుకుంది. ఆకాశానికి చిల్లు పెట్టాలంటే ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తుకి రాయి విసరాలి. వాళ్లు ఆకాశం అయితే కాదు. మరి చిల్లు పెట్టలేమా మనం ? – ఇది అఖిలేశ్ యాదవ్ యూపీలో ప్రచారం మొదలు పెట్టినపుడు మోతమోగిన మాట. వాళ్ల పెత్తనాన్ని ఎత్తి పడేద్దాం, కమలం వాడిపోయేలా మన వేడి చూపిద్దాం అంటూ సాగుతున్న సమాజ్ వాదీ ప్రచార యాత్ర ప్రత్యర్థులకి హడల్ పుట్టిస్తోంది. భారీ ర్యాలీలు, ఊహకు అందనంతగా హాజరవుతున్న జనం, ఎక్కడా ఎదుటివాడికి అవకాశం ఇవ్వకుండా, ఇది నవ సమాజ్ వాదీ పార్టీ. పెద్దలు ఆశీర్వదిస్తే చిన్నలు రేపటిని గెలుస్తారు, నన్ను దీవించండి – అంటూ ఏకధాటిగా అఖిలేశ్ చేస్తున్న ప్రసంగాలకి ఉత్తర ప్రదేశ్ ఉర్రూతలూగుతోంది. ఈ వాటం చూస్తుంటే బీజేపీ ఆలోచనలో పడే పరిస్థితి.
ఎదుటివాడి వీక్ నెస్ ఏంటో కనిపెట్టి, సూది మొనంత సందు దొరికినా గడ్డపలుగు దిగేసే రాజకీయం చేస్తుంది బీజేపీ. అలాంటిది అఖిలేశ్ వేస్తున్న ఎత్తుగడలు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తాయ్. కాశీ, అయోధ్యలతోపాటు విష్ణు నగర్ నిర్మిస్తా అంటున్నాడు. పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వేను ఆనుకొని అతి భారీ బలరాముడి విగ్రహాన్ని ప్రతీష్టించి మన జన గౌరవాన్ని పెంచుతానని ప్రకటించేశాడు. ఇలాంటివి ప్రస్తావించడం బీజేపీ స్టైల్. కానీ అఖిలేశ్ చదివిన ఆకులు ఎక్కువే కనిపిస్తున్నాయ్ ఈసారి. అందుకే హిందూ యువ వాహిని లాంటి వారంతా అఖిలేశ్ తో కలిశారు. మన కాంబినేషన్ MY. M ఫర్ ముస్లిం. Y యాదవ్ అని చెబుతూనే మిగతా కులాల్ని, మరీ ప్రత్యేకించి దళిత వర్గాల్ని ఆకర్షించేందుకు అన్ని ప్రయత్నాలూ ఆల్రెడీ చేసేశాడు. సమాజ్ వాదీ ఎప్పుడు రంగంలోకి దిగినా అది ములాయం పార్టీ కాదు ముల్లా పార్టీ అని బీజేపీ దాడి చేసేది. అలాంటిది ఇప్పుడు అఖిలేశ్ బ్యాటింగ్ చూసి, ఆదరాబాదరా వ్యూహాలు మార్చుకుంటోంది.
బీజేపీ ఆత్మరక్షణ ఓ వైపు. అఖిలేశ్ యాదవ్ సోషల్ ఇంజనీరింగ్ మరో వైపు అన్నట్టు మారిపోయింది యూపీ సీన్. సమాజ్ వాదీ వచ్చేస్తోంది, దీవించండి అంటూ విజయ్ యాత్ర పేరుతో ప్రచారం చేస్తున్న అఖిలేశ్ సొంత కుటుంబ కలహాల్ని గెలిచాడు. బాబాయ్ శివపాల్ యాదవ్ వచ్చి తన పక్కన నిలబడుతున్నాడు ఇప్పుడు. యోగీ ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకొని ఉస్సూరన్న నిషాద్ లాంటి వర్గాలన్నీ అఖిలేశ్ వైపే చూస్తున్నాయ్. నాన్ యాదవ్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ అన్నీ ఏకం కావాలి, ఎంత మంది మనం కలిస్తే, అంత గొప్పగా మన గొంతు వినపడుతుందీ అంటున్న అఖిలేశ్ ఇప్పటికే – మౌర్య, కుష్వాహ, కేవత్, హోయిరీ, గదేరియా, నాయి, కుర్మీ, కశ్యప్, బింద్, రాజ్ భర్ లాంటి వర్గాలని ఏకం చేయడంలో విజయవంతం అయినట్టే కనిపిస్తున్నాడు. అందుకే మాయావతికి దూరమైన దళిత వర్గాలు తమకు దగ్గర అవుతున్నాయని ఆశ పడిన బీజేపీ కూడా ఇప్పుడు ఆలోచనలో పడుతోంది. ఇక పార్టీల వారీగా కూడా లెక్క ఇలాగే ఉంది. జాట్లలో గట్టి పట్టుండే రాష్ట్రీయ లోక్ దళ్ అఖిలేశ్ తోనే ఉంది. రైతు పోరాటం తర్వాత బీజేపీ అంటేనే జాట్లు భగ్గుమంటున్నారు. పశ్చిమ యూపీ ఆగ్రహంతో నివురుగప్పిన నిప్పులా ఉంది. బీజేపీ బుగ్గి అయిపోవడం ఖాయమే అనిపిస్తోంది. సుహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ, డొమక్రటిక్ పార్టీ, అప్నాదల్ – కమ్యూనిస్ట్, పొలిటికల్ జస్టిస్ పార్టీ, లేబర్ పార్టీ, అఖిల భారతీయ కిసాన్ సేన – ఇలా ప్రాంతాల వారీగా ప్రభావం చూపే ఉప ప్రాంతీయ పార్టీలన్నీ అఖిలేశ్ వైపే చేరిపోయాయ్. గెలిచేది ఎవరో తేల్చి చెబుతున్నట్టుగా ఉంది ఆ వాటం చూస్తుంటే !
మోదీ దేశాన్ని బీడు పెట్టాడు. ఉత్తర ప్రదేశ్ ని మత ఘర్షణలు, అత్రాస్ లాంటి ఘోరాలకి నిలయం చేసేశారు అంటూ కాంటెంపరరీ విషయాలు వదలట్లేదు అఖిలేశ్. అభివృద్ధికి నమూనా నా పాలన, కావాలంటే 2012 – 17 నాటి పాలనను యోగి రాజ్ తో పోల్చి తేల్చుకోండి అని సవాల్ విసురుతున్నాడు. వీటితోపాటు ఓటర్లను ప్రభావితం చేసేది ఐడియాలజీ. పైగా ఇప్పుడు ఎన్నికలు బీజేపీ వర్సెస్ సమాజ్ వాదీ అన్నట్టుగా మారిపోయాయ్. మాయావతి ఏనుగు ఎటు పోయిందో అంతు చిక్కట్లేదు. ప్రియాంక కొత్త లెక్కలు వేసినా కాంగ్రెస్ లో అనుకున్నంత ఉత్సాహం రాలేదు. ఈ రెండూ పరిణామాలూ సమాజ్ వాదీకే ప్లస్ అవుతున్నాయ్ అనిపిస్తోంది ఇప్పుడు ఎన్నికల ఉత్సాహం చూస్తుంటే. ఇక యోగీకి చాలా తలనొప్పులు, తప్పులూ ఉన్నాయ్. రాష్ట్రస్థాయి పరీక్షల్లో పేపర్ల లీక్, దళిత యువతులపై అత్యాచారాలు, చిన్నారుల అనారోగ్య మరణాలు లాంటి వైఫల్యాలను కవర్ చేసుకునేందుకే యోగీకి సమయం సరిపోవడం లేదు. అన్నిటికీ మించి రైతు చట్టాల రచ్చ బీజేపీకి తీరని డామేజ్ ఆల్రెడీ చేసేసింది. ఇక ఇప్పుడు మోడీ, అమిత్ షా రంగంలోకి దిగి జనం దృష్టిని మళ్లించేందుకు కొత్త ఎత్తుగడ వేస్తున్నా అఖిలేశ్ వదిలిన బాణంగా దూసుకుపోతూనే ఉన్నారు. కమలం కుంభస్థలాన్ని కొట్టి తీరుతా అని సవాల్ చేయడం చూస్తే ఇప్పటికైతే సమాజ్ వాదీ 250 మార్కును అందుకోవడం ఖాయం అనే ఫీలింగ్ కల్గుతోంది. పంచాయతీ ఎన్నికల్లో సమాజ్ వాదీ సాధించిన తిరుగులేని విజయమే దానికి రుజువు అనే వాదన బలపడుతోంది.
యూపీ ఎన్నికలకు ఇంకా పది వారాలకు పైగా సమయం ఉంది. ఈలోగా పరిణామాలూ మారితే మారొచ్చు. కానీ అఖిలేశ్ – మిగతా రాజకీయ నాయకుల్లాగా వ్యూహ కర్తలను నమ్ముకోలేదు. జనాన్ని నమ్ముకున్నట్టు కనిపిస్తున్నాడు. బీజేపీ మైండ్ గేమ్ ఆడితే, నేను గ్రౌండ్ లో నిలబడి ఆడతా అంటూ ఆల్రెడీ సవాల్ కూడా విసిరాడు. అందుకే యూపీ తీర్పు దేశ రాజకీయాల్లో మార్పుకి కారణం అవుతుందేమో అనిపిస్తోంది. యూపీ ఫలితాల తర్వాత మహారాష్ట్రలో ప్రభుత్వం రాత మారే అవకాశం ఉంటుంది. బీహార్ లో నితీశ్ కుమార్ కూటమి నుంచి బయటకు అడుగు వేయవచ్చు, ఏపీ లాంటి చోట్ల వచ్చే ఎన్నికల్లో గెలిచే పార్టీ అనుకున్న వాళ్లతో బీజేపీ జట్టు కట్టవచ్చు. ఇలా చాలానే జరుగుతాయ్. అందుకే యూపీ రాజకీయం ఏపీకి కూడా చాలా ముఖ్యం.