37 C
Vijayawada
Friday, April 12, 2024
Homeరాజ నీతిబీసీలపై జగన్ - చంద్రబాబు లెక్కల్లో తేడా ఇదేనా ?

బీసీలపై జగన్ – చంద్రబాబు లెక్కల్లో తేడా ఇదేనా ?

పది మంది బీసీలకి జగన్ కేబినెట్ లో చోటిచ్చాడు అనే మాట బయటకు రాగానే దడ, వణుకు – వడ పుణుకు అన్నీ వచ్చేస్తున్నాయ్. రాజకీయ ప్రత్యర్థుల విమర్శలు, టీడీపీ పాత బీసీ పేటెంట్ ను బొడ్డు చుట్టూ కట్టుకొని మళ్లీ బయటకు రావడం చూస్తున్నాం. ఆఖరికి ఈనాడు లాంటి లోతుగా, నిలకడగా ఉంటుంది అనే ముద్ర ఉన్న పేపర్ కుడా పేరుకి పదవులు ఇస్తే మాత్రం బీసీలకు ఒరిగేదేముంది – అని నేరుగా రాయడం ఆశ్చర్యపరుస్తోంది. టీడీపీ, చంద్రబాబు – ఈ ఇద్దరినీ సపోర్ట్ చేసే సోషల్ మీడియా టైగర్స్ తో పాటు ఈనాడుకు కూడా అర్థం కానీ కేలిక్యులేషన్ ఉందిక్కడ ! లోపాల మీద కర్టెన్ కప్పితే గొప్పదనం వచ్చేయదు. వీక్ నెస్ ఎక్కడుందో పట్టించుకోకుండా పక్క వాదనలు తీస్తే రాజకీయంగా కలిసొచ్చేది ఏమీ ఉండదు టీడీపీకైనా బాబుకైనా ! అందుకే కొన్ని విషయాలు నేరుగా మాట్లాడుకోవాలి.

టీడీపీ బీసీల పార్టీ. బడుగుల గొడుగు. తాడి చెట్టు ఎక్కిన గౌడన్నను నేరుగా రాజకీయాల్లోకి దించిన పార్టీ. మగ్గం నేసిన నేతన్నను రాజకీయ నేతగా మలిచిన పార్టీ. ఇదంతా ఫైల్ అని వేసుకొని చూడాల్సిన విజువల్. అంటే గతం అనమాట. మరి ఇప్పుడు ? ఉన్నదంతా కేవలం సింబాలిజమే ! వారసత్వమే ! లేదంటే, ఒక నాడు ఏదో సాయం చేశారని ఇప్పటికీ ఆ బరువును మోస్తూ మూలుగుతున్న పార్టీనే టీడీపీ. కులాల లెక్కల విషయంలో జగన్ పక్కాగా ఉంటున్నదీ, చంద్రబాబు, టీడీపీ లెక్క తప్పుతున్నదీ ఇక్కడే. ఆల్రెడీ బీసీలు మనతోనే ఉన్నారు… ఇక కావాల్సింది కాపులు అనుకుంటూ గత ఎన్నికల సమయంలో అటు వైపు మొగ్గింది టీడీపీ. ఉన్నది పోయింది. కొత్తది చేరింది కొంచెమే. ఆ మాత్రం 40 నుంచి 50 శాతం కాపు ఓటు ముందు నుంచి ఉన్నదే. అంటే లాభం గూబల్లోకి వచ్చేసింది. ఆ అడ్వాంటేజ్ ను నిలుపుకొనేందుకే జగన్ ఇప్పుడు మళ్లీ పాతికలో పది మంది బీసీలకి ఇచ్చానూ అంటున్నాడు.

కాకపోతే జగన్ బీసీకీ చంద్రబాబు బీసీకీ తేడా కొట్టొచ్చినట్టు ఉంటుంది. చంద్రబాబు బీసీ అని చెప్పే లీడర్లు తాము బీసీలం అని వారు కూడా అనుకోరు. ఒకవేళ అనుకున్నా… బీసీలు అక్కున చేర్చుకోరు. ఒకట్రెండు ఎగ్జాంపుల్స్ చూద్దాం. యమమల బీసీ అంటే ఎంత మంది యాదవులు ఎగిరి గంతేస్తారు ? రాండమ్ లెక్క తీయండి తెలిసిపోద్ది. కొల్లు రవీంద్ర పేరు చెబితే కొత్తగా పడే ఓట్లు ఎన్ని ? ఉజ్జాయింపుగా చెప్పండి చూద్దాం. అదే అటు వైపు… అనిల్ యాదవ్ ఉంటాడు. అతని తిట్లు మనకి నచ్చకపోవచ్చు. బీసీ అంటే బడుగు, అణగదొక్కబడిన వర్గం అని పేరు. అలాంటి వర్గం అగ్రెస్సివ్ గా దూకుడుగా, ఎదురు ఢీ కొట్టినట్టుగా ఉండే వాళ్లను చూసి జబ్బ చరుస్తుంది. అనిల్ అందుకే అలా ఉంటాడు. యాదవుల్లో ఉత్సాహం నింపగలడు. అని తిట్లును వాళ్లు సపోర్టు చేయకపోవచ్చు. కానీ దూకుడును ఇష్టపడతారు జగన్ ఈ పాయింటును వాడేస్తాడు. అదే ఇటువైపు – అటు వైపు మధ్య తేడా ! సపోజ్ క్రిష్ణా జిల్లా నుంచి బీసీకి ఇచ్చిన చోటునే చూడండి. కొల్లు ఉద్ధరించింది ఏంటో బందరుకి కూడా తెలుసో లేదో తెలవదు. ఎక్కడో మెట్ట మీద నుంచి వచ్చి గెలిచిన జోగి రమేశ్ కి గౌడ కోటాలో చోటు దొరికేసింది జగన్ కేబినెట్ లో. కరకట్ట మీదకి ఎగిరి దూకాడనో, ఎవరి మీద అయినా నోరేసుకొని పడతాడనో – లెక్క ఏదైనా కావొచ్చు. జగన్ బీసీల్లో దూకుడు ఉంటుంది. జగన్ కోసం నిలబడే తత్వంతోపాటు… ప్రత్యర్థిని మెసలనివ్వని కసి కనబడుతుంది. పైగా విడదల రజనీ లాంటి కొత్త వాళ్లకి కూడా ఛాన్సు దొరుకుతుంది. అంటే ఎవరికైనా అవకాశం ఉంటుంది అనే సందేశం ఇవ్వడం అది. రాజకీయంలో ఇలాంటి ఆశ కల్పించడం, కొన్నిసార్లు నిలబెట్టుకోవడం అవసరం. అదే బలమైన వర్గాన్ని, సమర్థకుల్ని తయారు చేస్తుంది. కానీ ఇటు వైపు – బీసీ గర్జనలో కూడా ఊపు ఊపే స్థాయిలో నాలుగు ముక్కలు మాట్లాడలేని బేలతనమే ఉంటుంది. రెండున్నర దశాబ్దాల చరిత్ర ఇది.

ఇక మిగతా కులాల లెక్కలు కూడా అంతే ! సపోజ్, ప్రత్యర్థి చంద్రబాబు కులం నుంచి కేబినెట్ కి చోటు పెట్టాలీ అనుకున్నప్పుడు జగన్ కి కొడాలి నానీ కనిపించాడు. తొలి రెండున్నరేళ్లలో ! కొడాలి తిట్టిన తిట్లకి వ్యతిరేకత వచ్చింది లాంటి వత్తిలో పత్తి కబుర్లు తర్వాత. ఇక్కడ లెక్క సంగతి మాత్రమే మాట్లాడుకుందాం. అంటే దూకుడు, తేల్చుకుంటా అనే తత్వం, జగన్ కోసం నిలబడతా నేను – నా కులం ఏదైనా కావొచ్చు అని చెప్పించడం అక్కడ ఉద్దేశం అంతే. అదే జగన్ ప్రత్యర్థిగా ఉన్నాడు చంద్రబాబుకి. మరి రెడ్డి కులం నుంచి బాబు ఎవరికి చోటు పెట్టాడు ? లిస్టు చూస్తే మీసాలు రోషంలో నిలబడి గంతేస్తాయి. పల్లె రఘునాధరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి… ఎండ్ సో. వీళ్ల వీరపోరాటం గురించి ఇంకోసారి ఎప్పుడైనా మాట్లాడదాం. అంటే బీసీలైనా, మరో కులం అయినా జగన్ కేలిక్యులేషన్ ఒకటే. విధేయత, తన కోసం, పార్టీకోసం ఎట్టిపరిస్థితుల్లో నిలబడటం. ఈ రెండింటికీ మించి… ప్రత్యర్థిపై అడ్డం పొడుగూ లేకుండా దాడి చేసేయడం. ఈ మూడూ ఉంటే ఛాన్స్ వచ్చేస్తది మనకి అనే సంకేతం ఇస్తాడు. కసి, టెంపర్ రగిలిస్తాడు. వైసీపీ రాజకీయం అట్లుంటది. టీడీపీలో లోపించేది అదే. ఇక, ఒకడికి పదవొస్తే ఆ వర్గానికి ఏం లాభం – అని ఈనాడు లాంటి దిగ్గజ పత్రిక రాయడం నిజంగా ఆశ్చర్యం. మంత్రి పదవి అంటే ఒకటే ఉంటుంది. అది రాజ్యాంగం. ఓ కులం వాళ్లు 43 లక్షల మంది ఉన్నారు కాబట్టి ఆ కులం పైకి రావాలీ అంటే ఆ 43 లక్షల మందీ మంత్రులుగా ఉండాలి అని చెప్పే వీలు ఏమైనా ఉంటే… ఎడిటోరియల్ రాస్తే బెటర్. అయినా, రాజకీయంలో ఫ్రస్ట్రేషన్ ముందు నడవకూడదు ఎప్పుడూ. అలా నడిస్తే ఇలాగే ఉంటుంది. వ్యూహం ముందు నడవాలి. ఫ్రస్ట్రేషన్ ను క్రమంగా దాటాలి. దానికి ఓపిక, తెలివి, వాస్తవాలను ఒప్పుకొని, అర్థం చేసుకుని, తీరును మార్చుకునే తత్వం కావాలి.

కాపుల విషయంలో కూడా అంతే ! రిజర్వేషన్ ఇచ్చినా, కార్పొరేషన్ పెట్టినా ఇంకేం చేసినా చెప్పి ఒప్పించే సత్తా ఉన్నోడు ఎవరున్నారు ఈ పక్కన ? అందుకే సౌండ్ రాలేదు. అటు పక్కన ఇప్పుడు కార్పొరేషన్ లేదు, రిజర్వేషన్ రాదు అని ముందే చెప్పినా కాపుల వైపు నుంచి ఊపు కనపడదు. ఎందుకంటే క్లారిటీ. ముద్రగడ లాంటి వాళ్లను నిద్రపుచ్చే యంత్రాంగం ఉంటుంది. పవన్ లాంటి వాళ్లు ముందుకొచ్చినా… ఎరా పవన్ నాయుడూ, నేనూ కాపేరా అంటూ మాట్లాడే పేర్ని లాంటి ఫేసు ఉంటుంది. దాని వల్ల లాభం ఏంటి అని అమాయకంగా అడగొద్దు. సామాజిక ఈక్వేషన్లను బ్యాలెన్స్ చేయడం, ఆకట్టుకోవడం, ఎదుటివాడిని ఎటాక్ చేయడమే రాజకీయంలో కీలకం. గెలుపు ఓటములు రీజనల్ పార్టీల్లో ఆ పైనున్న నాయకుడి బాధ్యత. ఈ డివిజిన్ క్లియర్ గా ఉన్న పార్టీ వైసీపీ. అందుకే ప్రిక్షన్ లేదు. ఈ తిట్లు తిట్టేవాళ్లకి భయం లేదు. అంతా పైవాడు చూసుకుంటాడన్న నమ్మకం. ఇటు వైపు ఆ క్లారిటీ, ఈ నమ్మకం – రెండూ ఎక్కడున్నాయో వెదికి పట్టుకోవాలి ముందు.

పోనీ ముందు నుంచి ఇంతేనా అంటే కాదు. తొలి జనరేషన్ పిక్కింగ్ అదిరిపోయింది టీడీపీలో ! అటు వైపు దేవేందర్ గౌడ్ లాంటి నాయకుడు బీసీ దిగ్గజం అనే స్థాయికి ఎదిగింది టీడీపీలోనే. ఇటు వైపు ఎర్రన్నాయుడు ఢిల్లీ లెవెల్లో గొంతు వినిపించిన సందర్భాలు ఎన్నో. ఆ తర్వాత ఎందుకు అలాంటి వాళ్లు రాలేదూ అంటే… కారణం ఆ ఒక్కడికే తెలియాలి. ఎందుకంటే ఏం మాట్లాడినా సోషల్ మీడియా టైగర్స్ కి కోపాలు వచ్చేస్తాయ్. లోపాల గురించి వీళ్లకి తెలవదు. రాజకీయాలు చేసి ఉండరు. దగ్గర నుంచి చూసి ఉండరు. పోనీ లోతుకెళ్లి అర్థం చేసుకునేంత బుర్రకాయ్ కూడా ఉండదు. సోషల్ మీడియా గోడల మీద మాత్రం పచ్చరంగును పిచ్చపిచ్చగా గుమ్మరిస్తుంటారు వీళ్లు. నిప్పుల మీద దుప్పటి కప్పి అంతా సవ్యంగానే ఉందని నమ్మించాలనుకుంటారు. తమని తాము మోసం చేసుకుంటారు. దిగువ నుంచి ఎగువ వరకూ ఇలాంటి మైండ్ సెట్టే అసలు ఎనిమీ.

ఇంత చెప్పుకున్నాక ఇంకో విషయం కచ్చితంగా మాట్లాడుకొని తీరాలి. బీసీ పాలసీలు, మంత్రి పదవులు గెలిపిస్తాయా – ఇంత అరాచకం, కరెంటు కోత, చెత్త పన్ను, రోజుకో కొత్త పన్ను అని చిట్టా విప్పకండి. మోడీ ఎరాలో రాజకీయాన్ని ఎన్నికల మేనేజ్మెంటే నడిపిస్తోంది. మంత్రి కాన్వాయ్ 11 మందిని తొక్కి చంపిన చోట కూడా అదే పార్టీ తొడ గొట్టి గెలిచిన చరిత్ర నడుస్తున్న రోజులు ఇవి. అంటే – చెప్పాలనుకున్నది చెప్పడం, ఇవ్వాలనుకున్నది ఇవ్వడం, ముందు పెట్టాలనుకున్న వర్గాన్ని ముందు పెట్టి – వాళ్లకి గొంతు నివ్వడం మాత్రమే రాజకీయ పార్టీ విధి. అదో సింబాలిజమ్. ఎన్నికల కోసం జనాన్ని నమ్మించడం, ఎదురుదాడి చేయడం, ఎన్ని బొక్కలున్నా కప్పిపుచ్చుకోవడం నాయకుడి బాధ్యత. మొన్న ఎన్నికల్లో ఆ పని వైసీపీ సక్సెస్ ఫుల్ గా చేసింది. గెలిచింది. ఇంత చెప్పిన తర్వాత కూడా, మేం గెలుస్తాం చూడండి అని కొన్ని కోళ్లు – చికెన్ షాపు ముందుకొచ్చి తొడకొట్టొచ్చు. శబ్బాష్. అలాంటి వాళ్ల కోసం ఓ మాట.

ఎదుటివాడు ఓడిపోతే ఇవతల వాడు ఎవడైనా గెలుస్తాడు. అదే ఎదుటివాడిని ఓడించి గెలవాలంటే మాత్రం దమ్ము, దైర్యం, నమ్మించే నేర్పు, అన్నిటికీ మించి ఖలేజా కావాలి. ఇవి లేకుండా కూడా గెలిస్తే గెలవచ్చు. ఆ విజయం ఎంతో కాలం నిలవదు. అదే ఇవన్నీ ఉన్నప్పుడు ఒక్కోసారి ఓడినా… మళ్లీ గెలుస్తామనే ధీమా, ఆ కుర్చీ నాదీ.. అని చెప్పే దమ్ము వస్తాయ్. పది కాలాలపాటు రాజకీయం చేయాలంటే ముందు రియలైజేషన్ కావాలి. అది లేకుండా, సొంత వర్గాలతో డొల్ల డప్పులు కొట్టిస్తే, సాయంత్రానికి సౌండు చల్లారుతుంది. లాంగ్ రన్ లో లాభం ఉండదు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments