26 C
Vijayawada
Sunday, July 14, 2024
Homeరాజ నీతిరాజకీయాల్లో వెంకయ్య మళ్లీ క్రియాశీలకం అవుతారా ?

రాజకీయాల్లో వెంకయ్య మళ్లీ క్రియాశీలకం అవుతారా ?

మరో ఏడు నెలల్లో రాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయ్. మరో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికల హీట్ వచ్చేస్తుంది. రాష్ట్రపతి కావాలనే ఆకాంక్షగానీ, అవ్వాలనే కోరిక గానీ తనకి లేదని వెంకయ్య ఇప్పటికే చిరంజీవికి చెప్పేశారు. ఇంతకీ ఏంటి మేటర్ ? వెంకయ్య రాజకీయాల్లో క్రియాశీలకం అవుతారా ? అయ్యే అవకాశం ఉందా ? ఒకవేళ అదే జరిగితే దేశం అంతా ఓ లెక్క. ఏపీకి మాత్రం మరో లెక్క. ముఖ్యంగా వైసీపీ ఉలిక్కిపడుతుంది. ఎందుకంటే కాస్త రివైండ్ చేయండి, వెంకయ్య ఢిల్లీలో పవర్ లో భాగస్వామిగా ఉన్న ప్రతీసారి ఇక్కడ చంద్రబాబే ముఖ్యమంత్రి. వెంకయ్య ఎఫెక్ట్ ఎంత ఉందనేది పక్కనపెడితే, ఇదే వాస్తవం. అందుకే వెంకయ్య క్రియాశీలక రాజకీయాల్లోకి మళ్లీ వస్తారా అనేది కీలక ప్రశ్నే !

వెంకయ్య రాజకీయాల్లో క్రియాశీలకంగా లేకుండా చేసేందుకే ఆయన్ని ఉపరాష్ట్రపతిని చేశారు మోడీ, షా. ఇది ఓపెన్ సీక్రెట్. వాజ్ పేయి హయాం నుంచి ఢిల్లీలో యాక్టివ్ గా ఉండి, సీనియారిటీ ఉన్నవాళ్లని ఏదో రకంగా తప్పించేందుకు రకరకాల ఫిల్టర్లు తెచ్చారు అప్పట్లో. 75 ఏళ్లు దాటిన వాళ్లు దూరంగా ఉండాలని అద్వానీ, జోషీ లాంటి వాళ్లని తప్పించారు. కాలధర్మం చెంది జైట్లీ, సుష్మ, అనంతకుమార్ లాంటి వాళ్లు తెరమరుగు అయ్యారు. ఇక ఎటొచ్చీ యాక్టివ్ పోర్టుఫోలియోల్లో మిగిలింది ఒక్క రాజ్ నాథ్ సింగ్ మాత్రమే. యోగీ యూపీలో సీఎం అయ్యాక, కొడుకుపై ఆ మధ్య ఏవో ఆరోపణలు వచ్చాక ఇక రాజ్ నాథ్ కూడా పెద్దగా జోక్యం చేసుకోవడం లేదు రాజకీయాల్లో ! ఆయన శాఖ ఏదో ఆయన చూసుకుంటున్నట్టు ఉన్నారు. ఇక ఎటొచ్చీ గడ్కరీ ఉన్నారు. ఆయన ఈ మినహాయింపులకే పెద్ద మినహాయింపు. ఆ విషయం మరోసారి చర్చిద్దాం. ఇంతకీ వెంకయ్య మేటరేంటి ?

రాష్ట్రపతి ఎన్నికలు 2022 జూలైలో జరుగుతాయ్. అంటే సరిగ్గా యూపీ ఎన్నికలు అవగానే అనమాట. అంటే యూపీలో గెలిస్తే ఓ లెక్క. ఎందుకంటే పూర్తి సంఖ్యాబలం ఉంటుంది. ఇప్పుడైతే యూపీలో బొటాబొటీగా గెలవొచ్చు అని సి ఓటర్ సర్వేలో చెప్పించుకుంది బీజేపీ. ఎన్నికలకి మరో నాలుగు నెలలు కనీసం సమయం ఉంది కాబట్టి బొటాబొటీ కాస్త అటూ ఇటూ అయినా కావొచ్చు. అదే జరిగితే లెక్క మారుతుంది. పూర్తి మెజారిటీ లేకపోతే, విపక్షాల్ని కూడా మద్దతు అభ్యర్థించాల్సిన పరిస్థితి ఉంటే కనుక, అప్పటి అర్థమెటిక్ ను బట్టీ, వెంకయ్యకు ఓపెన్ ఆఫర్ ఇవ్వొచ్చునేమో బీజేపీ. ప్రతిపక్షాల్ని కన్విన్స్ చేసి మీరు మద్దతు కూడగట్టుకోండి అని. ఎందుకంటే మోడీ మీద విపక్షాల్లో సానుకూలత లేదిప్పుడు. అలాంటప్పుడు ఇదో ఆప్ఘన్ అవ్వొచ్చు. అలా కాకుండా బీజేపీ యూపీని గెలుచుకుంటే కనుక – కాస్త అటూ ఇటూగా 200 దగ్గర ఆగితే మాత్రం ఈక్వేషన్ మరోలా ఉంటుంది. ఈసారి, అంటే 2024లో బీజేపీకి మెజారిటీ రాదని తేలిపోతుంది. అలాంటప్పుడు కొత్త మిత్రులు, సానుకూల పార్టీలూ అవసరం అవుతాయ్.

ఇలాంటి సమయంలో వెంకయ్య అవసరం పడొచ్చు. ఇప్పటి వరకూ మోడీ షా పవర్ గేమ్ ఆడేశారు. మధ్య ప్రదేశ్ లాంటి చోట్ల అడ్డంగా విపక్షాన్ని విరిచి ప్రభుత్వాలు ఏర్పాటు చేసేశారు. ఇలాంటి వాటికి ఏదో రోజు పే బ్యాక్ టైమ్ వచ్చినా వస్తుంది. 2024 ముందే అలాంటి సంకేతం కనిపిస్తే వెంకయ్య రాజకీయాల్లో మళ్లీ యాక్టివేట్ అయ్యే సీన్ ఉండొచ్చు. కాకపోతే ఒక్కటే కండిషన్. యూపీలో బొటాబొటీ అయితే వెంకయ్య రాజకీయాల్లో క్రియాశీలకం అవ్వొచ్చు అంటున్నాం. అదే రకంగా యూపీలో అలా అయితే బీజేపీ వెంకయ్యకి రాష్ట్రపతిగా ఆఫర్ ఇవ్వొచ్చునేమో అని కూడా అంటున్నాం. కానీ ఇక్కడ – ఆ ఆఫర్ కళ్లముందుకు వస్తే, వెంకయ్య వదులుకుంటే పరిస్థితి మరోలా ఉండొచ్చు. ఇట్స్ ఎ ట్రికీ ఈక్వేషన్. ఈ రెండూ కాకుండా, బీజేపీ ఒకవేళ వెంకయ్యకు రాష్ట్రపతిగా ఆఫర్ ఇవ్వకపోయినా ఆయన క్రియాశీలకం అయ్యే పరిస్థితి రావొచ్చు. ఇక 75 ఏళ్ల నిబంధన ఉందీ అనుకున్నా వెంకయ్యకి అప్పటికీ ఇంకా రెండేళ్ల సమయం ఉంటుంది దాదాపుగా. 75 అంటే 75 పూర్తి కావాలన్నమాట. పైపెచ్చు, మోడీకి కూడా ఇంచుమించు అదే వయసు. మరి అలాంటి నిబంధనకి సడలింపులు, మినహాయింపు క్లాజులూ వస్తాయేమో కూడా చూడాల్సిఉంది.

యూపీ ఫలితాల్ని బట్టీ మోడీ ప్రభ తగ్గుతోంది ఆరెస్సెస్ అర్థం చేసుకుంటే మాత్రం బీజేపీలో సమీకరణలు మారతాయ్. వెంకయ్యకి ప్రయారిటీ రావడంతోపాటు, గడ్గరీ వెయిట్ కూడా పెరుగుతుంది. అంటే రాజకీయంగా. అదే జరిగితే పొత్తుల వేట, మిత్రుల కోసం తహతహ లాంటివి అన్నీ ఉంటాయ్. ఇలాంటి సమయంలో సంధానకర్తగా వెంకయ్య అవతరించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అమిత్ షా మోడీ ఇద్దరూ ఈక్వల్లీ డేంజరస్ అని మిగతా పార్టీలు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు నిర్ధారణకి వచ్చేశాయ్. ఇలాంటి సమయంలో వెంకయ్య అవసరం పడుతుంది. అదే జరిగితే దేశం మొత్తం ఎలా ఉన్నా ఏపీలో మాత్రం సమీకరణ అమాంతం మారుతుంది. టీడీపీ గ్రాఫ్ పెరిగింది, మళ్లీ వస్తుంది అని బీజేపీ రియలైజ్ అయితే ఇక గేమ్ మొత్తం ఛేంజ్ అయ్యే అవకాశం ఉండొచ్చు. ఇదంతా జరగడానికి సరిగ్గా మరో ఏడాది పట్టొచ్చు. అంటే మళ్లీ వచ్చే ఈ రోజుల నాటికి అనమాట.

వైసీపీ నాయకులు ఆంతరంగిక సంభాషణల్లో వ్యూహాత్మకంగా ఓ మాట చెబుతుంటారు. వచ్చే జూలై నాటికి ఓ నాయకుడికి పదవీకాలం అయిపోతుంది. అంతకు ముందు జూన్ లోనే ఓ నాయకుడి టెన్యూర్ పూర్తి అవుతుంది. ఇక ఆగస్టు నాటికి ఆ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాయన కూడా రిటైర్ అవుతాడు. ఆ తర్వాత పరిణామాలు వేరుగా ఉంటాయ్ అంటూ ఉంటారు. నిజమే. పరిణామాలు వేరుగానే ఉండొచ్చు. అయితే వాళ్లకి ఫేవర్ గానా, ప్రతికూలంగానా అనేది కూడా పాయింటే కదా ! ఎందుకంటే అందుబాటులో ఉన్న అన్ని అవకాశాల్నీ మొదటి రెండేళ్లలోనే వాడేశాక, ఇక మిగతా మూడేళ్లు ఏం ఎదురొస్తాయో ! ఎదురుచూడాలి మరి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments