28.2 C
Vijayawada
Sunday, June 16, 2024
Homeనీతి ప్రత్యేకంనీ బంతిని చూసే ఈ భూమి తిరగడం నేర్చింది... ఛాంప్ !

నీ బంతిని చూసే ఈ భూమి తిరగడం నేర్చింది… ఛాంప్ !

పచ్చని పిచ్ మీద బాల్ లెగ్ సైడ్ కి ఆమడ దూరంలో పోతోంది. బద్ధకంగా గ్యాటింగ్ బ్యాటింగ్ చేస్తున్న క్షణం అది. అంతలోనే, ఠక్కున ఏదో గుర్తొచ్చినట్టు బంతి అమాంతం వికెట్ల వైపు తిరిగింది. బ్యాట్సుమన్ ఆశ్చర్యపోతే, ప్రపంచం మాత్రం ఏకంగా నిర్ఘాంతపోయింది. అది బాల్ ఆఫ్ ద సెంచరీ. యాషెస్ లో వార్న్ మొదటి బంతి. ప్రపంచ క్రికెట్ నుదుటిన మొనగాడి పచ్చబొట్టు వేసిన స్టన్నింగ్ డెలివరీ ఇది. అవును. సెంచరీలు చాలా మంది చేయొచ్చు. వందల కొద్దీ వికెట్లూ తీయొచ్చు. కానీ బాల్ ఆఫ్ ద సెంచరీ వేసిన ఒకే ఒక్క వండర్ వార్న్. షేన్ వార్న్.

నువ్వేం ఉపఖండంలో పుట్టినోడివి కాదు. ఇండియాలో లాగా నీకేమీ దుమ్మురేగే డస్టీ పిచ్ లు ఇవ్వలేదెవ్వడూ ! మూడొంతుల మ్యాచులు ఆడింది ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజీలాండ్, సౌతాఫ్రికాల్లో. అయినా నువ్ 706 వికెట్లు తీశావంటే గింగిరాల్ని నీ వేళ్లకి ఉంగరాల్లా తొడుక్కున్నావేమో ! ఆ గ్రిప్పేంటో మాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎడం చేత్తో బంతిని కుడి చేతిలోకి ఎగరేయడంతో మొదలు పెట్టి, ఆరచేతికీ వేళ్లకి మధ్య ఒంపులో బంతిని మెలిపెట్టి… మధ్య వేలిని మీద పెట్టి… నాల్గో వేలితో వాటంగా సుడి తిప్పుతూ, వట్రంగా నువ్ గెంతి బంతి వదిలే తీరు బౌలింగ్ కే బైబిల్. స్పిన్నంటే రిచీని అప్పటికే చూసింది ఆస్ట్రేలియా. లిల్లీ పేస్ మానియా తెలుసు. మెక్ గ్రాత్ కూడా మొదలుపెట్టేశాడు. ఇలాంటి దిగ్గజాల్ని పక్కకి నెట్టుకుంటూ నువ్ సైలెంట్ గా వచ్చి చూస్తుండగానే సుల్తాన్ అయిపోయావ్ స్పిన్ కి. నువ్వు ఆడుతుండగా విజ్డెన్ కి ఇంకెవరూ నచ్చలేదు. అందుకే ఐదుసార్లు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అంటూ నీ ఇంటి చుట్టూ తిరిగింది. అదేదో వాడావంటూ నిన్ను బేన్ చేసిన ఏడాది కూడా వార్న్ ఎక్కడా… అంటూ విజ్డెన్ అవార్డ్ నిన్ను వెదుక్కుంటూ రావడం చూసి ఆశ్చర్యం వేసి అప్పుడే 20 ఏళ్లు.

కాన్ఫిడెన్స్ కి జెర్సీ తొడిగినట్టు కనిపించావ్. కవ్వింపులకు కేరాఫ్ అనిపించావ్. గొడవలకు దిగుతావ్. పిచ్ మీద అడ్డం నిలబడి అడ్డగోలుగా తగువాడతావ్ అనుకునేలోపే – ఐయామే హ్యూమన్ బీయింగ్ బాస్ అంటూ కూల్ చేసేస్తావ్. నాకేం తక్కువ అంటూ నువ్ పోటీ పడినా, కెప్టెన్సీ నీ వైపు రాకపోవడం చూసి బాధేసింది చాలాసార్లు. నా లాంటోళ్లు ఉండబట్టే స్టీవ్ గ్రేటెస్ట్ అయ్యాడంటూ నువ్ థియరీ తిప్పినప్పుడు జస్టిఫికేషన్ అనిపించింది. లో బడ్జెట్ లో నువ్ టీమ్ ని దించి, మెంటార్ నువ్వే, కెప్టెన్ నువ్వే, ఛేంజింగ్ లో విన్నింగ్ రన్స్ కొట్టేదీ నువ్వే అయ్యి… ఐపీఎల్ తొలి ట్రోఫీ ఎత్తినప్పుడు అనిపించింది – నువ్వేకంగా దానవీర శూరకర్ణ సినిమా చూపించేశావ్ మాకు అని ! కెప్టెన్సీ కోసం నీలో ఉన్న కసిని కుంచెలో ముంచి… కేన్వాన్స్ మీద పెయింట్ చేసినట్టు ఉంటుంది ఆ ఇనాగురల్ ఐపీఎల్. శబ్బాష్ షేన్.

వెయ్యికిపైగా వికెట్లు తీశావని ప్రత్యేకంగా పొగడక్కర్లేదు. ఆన్ ద ఫీల్డే కాదు ఆఫ్ ద ఫీల్డ్ న్యూస్ మేకర్ నువ్వని చెప్పక్కర్లేదు. నీ డిసిప్లీన్ ను ప్రశ్నించిన ప్రతీసారీ నువ్ ఆటతో ఆ నోటికి చెప్పిన సమాధానం రియల్లీ రిమార్కబుల్. అవును. నీ లాస్ట్ బట్ వన్ యాషెస్ గురించే ఈ మాట. 96 ప్రపంచ సంచలనాలు, మరో రెండేళ్లకి షార్జాలో సచిన్ తో చెలగాటం, ఆ పై చెన్నైలో ఎర్రబంతితో నువ్ వేసిన ఎత్తుగడలు, 36 ఏళ్లకి రీ ఎంట్రీ ఇచ్చి నువ్ చూపించిన కమ్ బ్యాక్ ఖలేజా… ఒకటా రెండా… నీ జర్నీలో ఎన్నోగుగ్లీలు. నీ లాంటి స్పోర్టింగ్ స్పిరిట్ కావాలని, నీ లాగా లైఫ్ ని ఫుల్లెస్ట్ ఎంజాయ్ చేస్తూ, రిగ్రెట్ లేకుండా బతకాలని అందరికీ అనిపిస్తుందేమో ! కానీ వార్న్ ఒక్కడే ఉండగలడు ఇలా అని నువ్ ప్రూవ్ చేసిన ప్రతీసారీ మా కళ్లల్లో నవ్వొచ్చేది. ఇప్పుడేంటో నీళ్లొస్తున్నాయ్.

పోకర్ ఆడావని పోకిరీవి మాత్రమే కాదు. హోల్స్ వెంటపడ్డావని గోల్ఫ్ కే పరిమితమూ అవ్వలేదు. బిగ్ బాష్ లీగ్ తో నీలోని బిలీనియర్ బయటకు వచ్చినప్పుడు సంతోషవేసింది. 706 జిన్ లాంచ్ చేసినప్పుడు, ఛస్… ఇండియాలో దొరకడం లేదే అని బాధేసింది. నిక్కర్ మీద నిన్ను అరెస్ట్ చేసి లండన్ లో కౌన్సెలింగ్ ఇస్తున్నప్పుడు – నీ కొడుక్కి ఏం సమాధానం చెబుతావ్ అని అడిగిన ప్రశ్నకు నీ సమాధానం తల్చుకొంటే నవ్వొస్తుంది. మా జాక్సన్ మీ కన్నా నా కన్నా మెచ్యూర్డ్ అన్నందుకు మరో 300 వందల పౌండ్లు ఫైన్ పెరిగిందని నువ్ చెప్తున్నప్పుడు… ద సేమ్ ఓల్డ్ గాయ్ అనిపించావ్. రషీద్ కి పాఠాలు చెబుతూనో, చీర్స్ గాళ్స్ తో కలిసి ఫోటోలు దిగుతూనో, ఏ మెగా టోర్నీ జరిగినా తళుక్కుమంటూనో నువ్ కనిపించినప్పుడు అదోరకం కిక్కు. ఈ జనరేషన్ లో నా ఫేవర్ స్టీవెన్ స్మిత్, కానీ అతను టీ20లో వద్దు అని నువ్ నిక్కచ్చిగా చెప్పే మాట విని మెచ్యూరిటీ వచ్చేసిందిరోయ్ అనుకొని ఎంతో కాలం కాలేదు. మరి ఇంతలోనే ఇలా ! బాధేస్తోంది. టాలెంట్ కి ఆయుష్షు తక్కువా ? డైటింగే నిన్ను తీసుకుపోయిందా ? మూడ్రోజుల నాటి నీ పోస్ట్ మమ్మల్ని ఎప్పటికీ వెంటాడుతుంది వార్న్. మిస్ యూ !

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments